KCR: కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌ను స‌హించం: మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్

 Minister Errabelli Dayakar says does not tolerate indecent remarks on KCR
  • విశాఖ ఉక్కు కంటే బ‌య్యారం ఉక్కే నాణ్య‌మైన‌ది
  • ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రైవేట్‌కు ఇస్తున్నార‌ని ఆరోప‌ణ‌
  • రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల‌న్న కేసీఆర్ డిమాండ్ స‌రైన‌దేన‌ని కామెంట్‌
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌ను స‌హించేది లేద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హెచ్చ‌రించారు. మహబుబాబాద్ జిల్లాలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ చేపట్టిన ఒక రోజు ఉక్కు దీక్ష విరమణకు ఎర్ర‌బెల్లి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ సిగ్గు లేకుండా జనంలో తిరుగుతోందని విమర్శించారు. విశాఖ ఉక్కు కంటే బయ్యారం ఉక్కు నాణ్యమైనదని ఆయన వెల్లడించారు. బండి సంజయ్ గుండుపై ఇనుప గుండ్లు పెడతామన్నారు. కేసీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

'బీజేపీ ఎంపీలు రాజీనామా చేయండి, లేకపోతే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించండి' అని ఎర్ర‌బెల్లి సవాల్‌ విసిరారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బయ్యారం ఉక్కు లేదు, కోచ్ ఫ్యాక్టరీ లేదు, గిరిజన యూనివర్సిటీ లేదంటూ వ్యాఖ్యానించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే, ఇండియన్ ఎయిర్లైన్స్ అన్నింటినీ బీజేపీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తోందని ఆరోపించారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సవరణ చేయాలని కేసీఆర్‌ అన్నారని, అందులో తప్పేమీ లేద‌న్నారు. రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలనడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. కులాల మధ్య, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేస్తోంద‌ని ఆయ‌న మండిపడ్డారు.
KCR
telangana
Errabelli
BJP
Bandi Sanjay

More Telugu News