CBI: ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు.. కుట్రలో ఆమె ప్రమేయంపై ప్రాధమిక ఆధారాలు ఉన్నాయన్న తెలంగాణ హైకోర్టు

OMC Case Telangana High Court finds evidence of Srilakshmi involvement in conspiracy
  • సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ 2015లో పిటిషన్ 
  • కుట్రలో తన పాత్ర లేదన్న శ్రీలక్ష్మి వాదనను అంగీకరించని కోర్టు
  • శ్రీలక్ష్మి మరిది రాకేశ్ బాబు ఆస్తులను కూడబెట్టినట్టు ప్రాధమిక  ఆధారాలున్నాయన్న కోర్టు
  • శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టివేత

అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఓఎంసీ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయడంతో పాటు పరిహారం ఇప్పించాలని కోరుతూ శ్రీలక్ష్మి 2015లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. మైనింగ్ లీజులు కేంద్ర పరిధిలోనివని, ఇందులో తన పాత్ర ఏమీ లేదన్న శ్రీలక్ష్మి వాదనను అంగీకరించలేమని కోర్టు తేల్చి చెప్పింది.

ఓఎంసీకి లీజులు మంజూరు చేసిన కుట్రలో ఆమె ప్రమేయంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. విధి నిర్వహణలో భాగంగానే లీజులు మంజూరు చేస్తూ జీవోలు ఇచ్చినట్టు ఆమె నిరూపించుకోవాల్సి ఉందని కోర్టు ఆదేశించింది. జీవోలో క్యాప్టివ్ మైనింగ్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదన్నది నిర్ధారించడానికి విచారణను ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొంది. కింది కోర్టు విచారించినప్పుడు తనకు రక్షణగా ఉన్న అన్ని అంశాలను వినియోగించుకోవచ్చని సూచిస్తూ 2015లో శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

అలాగే, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (1)(డి), 13(2)లు తమకు వర్తించబోవని, దీనికి సంబంధించి తనపై ఎలాంటి ఆరోపణలు లేవన్న శ్రీలక్ష్మి వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఆమె ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె మరిది ఎం.రాకేశ్‌బాబు ఆస్తులను కూడబెట్టినట్టు స్పష్టమైన ఆరోపణలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News