Nadendla Manohar: ఏపీలో సమస్యలకు ముఖ్యమంత్రే కారణం: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar slams CM Jagan and YCP leaders
  • వైసీపీ నేతలపై మండిపడిన నాదెండ్ల
  • సీఎం జగన్ ప్రజల కోసం నిలిచే వ్యక్తి కాదని వ్యాఖ్యలు
  • సీఎం బాటలోనే వైసీపీ ఎమ్మెల్యేలు నడుస్తున్నారని ఆరోపణ

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిధిలోని మత్స్యపురి గ్రామంలో వార్డు మెంబర్ చింతా అనంతలక్ష్మికి జనసేన నేతలు, కార్యకర్తలు అండగా నిలిచి రూ.14 లక్షలతో కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడి చింతా అనంతలక్ష్మి పూరింటిని కూల్చివేశారని ఆరోపించారు. రాత్రికి రాత్రి 200 మంది రౌడీలతో ఆనాడు జరిగిన ఘటన అందరినీ బాధించిందని వెల్లడించారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపునకు జనసైనికులు అద్భుతంగా స్పందించారని, ఒక మంచి ఆలోచనతో రూ.14 లక్షలతో ఆ మత్స్యకార కుటుంబాన్ని ఆదుకున్నారని నాదెండ్ల వివరించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారని, ఓట్ల కోసం యువతను భయపెట్టి, కేసులతో దౌర్జన్యాలకు గురిచేసే ప్రయత్నాలు జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కువయ్యాయని విమర్శించారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నేతలు, కార్యకర్తలతో కొబ్బరిచెట్లకు, భవనాలకు మూడు రంగులు వేయడం ఆపించాలని అన్నారు.

అసలు, రాష్ట్రంలో సమస్యల సృష్టికర్త ఈ ముఖ్యమంత్రేనని నాదెండ్ల వ్యాఖ్యానించారు. ఏ ఒక్క సమస్య పరిష్కారం కోసం ప్రజల తరఫున నిలబడింది లేదంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి బాటలోనే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నడుస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతూ తమ నియోజకవర్గాలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని విమర్శించారు. సీఎం అండతో దౌర్జన్యాలకు పాల్పడుతూ రెచ్చిపోయే విధానం ఎవరికీ మంచిది కాదని నాదెండ్ల హెచ్చరించారు.

  • Loading...

More Telugu News