Arvind Kejriwal: నేను ఉగ్రవాదినే అయితే.. మీ భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయి?: అరవింద్ కేజ్రీవాల్

If I am A Terrorist Arrest Me Says Arvind Kejriwal
  • నన్ను అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు?
  • ఈ పదేళ్లు మీరు నిద్రపోతున్నారా?
  • పార్టీలన్నీ అవినీతిమయమంటూ కేజ్రీవాల్ ఫైర్ 
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తాను వేర్పాటువాదినే అయితే ఎందుకు నిరూపించలేదని, తనపై ఎందుకు దర్యాప్తు చేయించలేదని ప్రశ్నించారు. దేశాన్ని విభజించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు పదేళ్లుగా చెబుతున్నారని, వాటన్నింటినీ చూసి నవ్వొస్తోందని కేజ్రీవాల్ అన్నారు. ఆ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.

‘‘నేను అంత పెద్ద ఉగ్రవాదినా? మరైతే మీ భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయి? కాంగ్రెస్ కూడా పదేళ్లు అధికారంలో ఉంది కదా? ఇన్నేళ్లు నిద్రపోతున్నారా? మోదీ నన్ను ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల కోసం బడులు, ఆసుపత్రులను కట్టిస్తున్న తాను ఓ మంచి ఉగ్రవాదినై ఉంటానని వ్యంగ్యంగా అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ సహా పార్టీలన్నీ అవినీతిమయం అయ్యాయన్నారు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సుక్బీర్ బాదల్, చరణ్ జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ లంతా ఒకే గూటి పక్షులన్నారు. అందరూ ఒకేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాత్రిపూట వీడియో కాన్ఫరెన్స్ కాల్ లో అందరూ మాట్లాడుకుని తమపై ఆరోపణలు చేస్తుండొచ్చని విమర్శించారు.
Arvind Kejriwal
New Delhi
AAP
Punjab

More Telugu News