Chandrababu: శాంతియుతంగా ధర్నా చేసిన విద్యార్థులపై కేసులు పెడతామని బెదిరించడం ఏంటి?: చంద్రబాబు

Chandrababu supports R Peta school students
  • ఆర్.పేట పాఠశాల విలీనం అంశంపై చంద్రబాబు స్పందన
  • మాట తప్పుతున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం
  • వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పాఠశాల అని వెల్లడి
  • విద్యార్థులకు టీడీపీ అండగా ఉంటుందని హామీ
చిత్తూరు జిల్లా కుప్పంలోని ఆర్.పేట జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల విలీనం అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తమ పాఠశాలను విలీనం చేయవద్దంటూ విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తే, వారి డిమాండ్ ను నెరవేర్చాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ధర్నా చేసిన విద్యార్థులపై కేసులు పెడతామని బెదిరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

ఆర్.పేటలోని జెడ్పీ ఉన్నత ప్రాథమిక పాఠశాలకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, ఎందరినో ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దిన పాఠశాల అని చంద్రబాబు వివరించారు. అలాంటి పాఠశాలను మూసివేయబోమని ప్రజలకు మాటిచ్చి, ఇప్పుడు మళ్లీ మడమ తిప్పడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులకు అండగా టీడీపీ నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఆర్.పేట పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు.
Chandrababu
ZP School
R Peta
Students
AP Govt
TDP
Kuppam
Chittoor District
Andhra Pradesh

More Telugu News