Prime Minister: ప్రతిపక్షాలది పాకిస్థాన్ అజెండా: ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం

Opposition Agenda is As Same As Pakistan Alleges PM
  • దేశభక్తి, అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకునే ప్రభుత్వం  పంజాబ్ కు కావాలి
  • పంజాబ్ సీఎం చన్నీపై మండిపాటు
  • యూపీ, బీహార్ సోదరులను రానివ్వొద్దన్న వ్యాఖ్యలపై ఫైర్
  • గురుగోవింద్ సింగ్, సంత్ రవిదాస్ లను అవమానించినట్టేనని వ్యాఖ్య
దేశభక్తి, అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వం పంజాబ్ కు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపించాలంటున్న ప్రతిపక్షాల అజెండా అంతా పాకిస్థాన్ అజెండానేనని ఆరోపించారు. ఇవాళ పంజాబ్ లోని ఫజిల్కా జిల్లాలోని అబోహర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు.

పంజాబ్ భద్రత, అభివృద్ధిపై చిత్తశుద్ధితో బీజేపీ మీ ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. ఒకరు పంజాబ్ ను గతంలో లూటీ చేశారని, మరొకరు ఇప్పుడు ఢిల్లీలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలూ ఒకే తానుముక్కలని, కానీ, ఇప్పుడు కుస్తీపట్టినట్టు డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు.

యూపీ సోదరులను రానివ్వొద్దన్న పంజాబ్ సీఎం చన్నీపై మండిపడ్డారు. గురుగోవింద్ సింగ్, సంత్ రవిదాస్ ఎక్కడ పుట్టారంటూ చన్నీని ప్రశ్నించారు. గురుగోవింద్ సింగ్ బీహార్ లోని పాట్నా సాహిబ్ లో పుడితే.. సంత్ రవిదాస్ యూపీలోని వారణాసిలో పుట్టారని గుర్తు చేశారు. అంటే ఆ రెండు రాష్ట్రాల నుంచి ప్రజలను రావొద్దనంటే.. వారిని అవమానించినట్టేనని పేర్కొన్నారు. బీహార్, యూపీకి చెందిన వాళ్లు పనిచేస్తున్న రాష్ట్రం ఇదొక్కటే కాదని, ఇంకా చాలా ఉన్నాయని  ప్రధాని మోదీ పేర్కొన్నారు.

రైతులను మోసం చేసింది కాంగ్రెస్సేనని చరిత్ర చెబుతుందన్నారు. స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయకుండా కాంగ్రెస్సే పెండింగ్ లో పెట్టిందన్నారు. ఆ ఫైళ్ల మీద కూర్చుని, పడుకుని కాలక్షేపం చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే ఆ సిఫార్సులను అమలు చేశామని తెలిపారు. బీజేపీ మాత్రమే పంజాబ్ లో మాఫియా పాలనను రూపుమాపుతుందన్నారు.
Prime Minister
Narendra Modi
Pakistan
Opposition
Punjab

More Telugu News