Hijab: ఇస్లాంలో ఈ ఐదు విషయాలే ఆవశ్యకం.. అందులో హిజాబ్ లేనే లేదు: కేరళ గవర్నర్

Kerala Governor Arif Mohammed Khan Says Islam Only Allows Five Things Essential
  • హిజాబ్ పై రేపింది వివాదం కాదు
  • ముస్లిం మహిళలను తరాలు వెనక్కు నెట్టే కుట్ర అది
  • సుప్రీంకోర్టు ప్రకారం ఆర్టికల్ 25 దానికి వర్తించదు
  • ఇస్లాంలో పేర్కొన్న వాటికే అది వర్తిస్తుందని కోర్టు చెప్పిందన్న ఆరిఫ్ 

హిజాబ్ వివాదంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరోసారి స్పందించారు. హిజాబ్ గొడవ వివాదం కాదని, అదో కుట్ర అని ఆరోపించారు. ముస్లిం మహిళలను మళ్లీ తరాలు వెనక్కు తీసుకెళ్లే కుట్ర పన్నారని మండిపడ్డారు. మతం, విద్య మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవని చెప్పారు. పురుషులు జ్ఞానం సముపార్జించుకోవాలనే ఇస్లాం ప్రబోధిస్తుందని చెప్పారు.

ఏది అవసరమో ఇస్లాం పుస్తకాల్లో క్షుణ్ణంగా విపులీకరించారని ఆయన పేర్కొన్నారు. అర్కాన్ ఇ–ఇస్లాం పేరిట ఉండే ఐదు విషయాలు ఇస్లాంలో తప్పనిసరి అని, అందులో హిజాబ్ లేదని స్పష్టం చేశారు. ‘దేవుడిపై విశ్వాసం’, ‘అనునిత్యం ప్రార్థనలు’, ‘రంజాన్ ఉపవాసాలు’, ‘సేవా కార్యక్రమాలు’, ‘హజ్ యాత్రలు’ ఇస్లాంలో తప్పనిసరి అని పేర్కొన్నారు. వాటికి వేటినీ కలపడం గానీ.. వాటిని తొలగించడం గానీ జరగకూడదన్నారు.

ఇస్లాంలో ఏది అవసరమన్న చర్చ వచ్చినప్పుడు.. హిజాబ్ మాటే లేదని ఆయన తేల్చి చెప్పారు. మత విశ్వాసాల్లో అంతర్భాగమైనవే ముఖ్యమైనవని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. వాటికే రాజ్యాంగంలో ఆర్టికల్ 25 వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. అందులో హిజాబ్ అనే అంశమే లేదన్నారు.

ప్రస్తుతం విద్యాసంస్థల్లో హిజాబ్ వివాదంతో బాలికలు, యువతులు చదువుకు దూరమవుతున్నారని ప్రశ్నించగా.. అది కేవలం అమ్మాయిలను విస్మరించడం వల్లే వాళ్లు చదువులకు దూరమవుతున్నారని చెప్పారు. ఖురాన్ లో ‘చదువు’ అంటే.. కేవలం దేవుడినే స్మరించడం కాదని, జంతువులు, నక్షత్రాలు, ఆకాశం వంటి వాటినీ చర్చించాలని అర్థమన్నారు. ఖురాన్ లోని 700కు పైగా పదాలు జ్ఞానం, ఆలోచన, ధ్యానం గురించి చెబుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News