Bappi Lahiri: లాస్ ఏంజెలెస్ లో ఉన్న బప్పీలహిరి కుమారుడు.. ఆయన రాకకోసం ఎదురుచూపులు!
- ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన బప్పీలహిరి
- శోకసంద్రంలో మునిగిపోయిన సంగీతప్రియులు
- రేపు ముంబైలో జరగనున్న అంత్యక్రియలు
భారతీయ సినీ పరిశ్రమ సంగీతాన్ని ఓ మలుపు తిప్పి, మన సంగీతంలో వెస్టర్న్ మ్యూజిక్ ని మిక్స్ చేసి సినీ ప్రేక్షకులను మైమరపించిన సంగీత దిగ్గజం బప్పీలహిరి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమ, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 69 ఏళ్ల ఈ సంగీత దిగ్గజం ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. అయితే, ఆయన అంత్యక్రియలు ఈరోజు జరగడం లేదు. బప్పీదా కుమారుడు అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో ఉన్నారు.
అమెరికా నుంచి ఆయన కుమారుడు ఇప్పటికే బయలుదేరారు. ఆయన వచ్చిన తర్వాత ముంబైలో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. బప్పీలహిరి మృతిపై భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీతో పాటు ఎందరో ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఒక అద్భుతమైన ప్రతిభావంతుడిని దేశం కోల్పోయిందని వారు నివాళులర్పించారు. 1952లో పశ్చిమబెంగాల్ లో బప్పీలహిరి జన్మించారు. దాదాపు 500 సినిమాలకు, 5 వేల పాటలకు ఆయన సంగీతాన్ని అందించారు.