Andhra Pradesh: సినీ స్టూడియోల నిర్మాణం కోసం విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతిలో భూసేకరణ!

Land acquisition in Visakhapatnam Rajahmundry and Tirupati for construction of cine studios
  • సినీ స్టూడియోల నిర్మాణం కోసం ప్రత్యేకంగా భూనిధి ఏర్పాటు
  • చలనచిత్ర అభివృద్ది సంస్థ ద్వారా అభివృద్ధి
  • స్టూడియో నిర్మాణానికి ముందుకొచ్చే ప్రైవేటు వ్యక్తులకూ భూ కేటాయింపు
  • ఈ నెలాఖరులో సినిమా టికెట్ల ధరలపై జీవో!
సినీ పరిశ్రమను విశాఖపట్టణానికి ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సినీ స్టూడియోల నిర్మాణం, షూటింగుల కోసం విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూ సేకరణకు నడుంబిగించింది. ఈ మేరకు ప్రత్యేకంగా భూనిధి ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు తెలుస్తోంది.

అలా సేకరించిన భూములను చలనచిత్ర అభివృద్ధి సంస్థకు అప్పగించి ఆ సంస్థ ద్వారానే అభివృద్ధి చేయనున్నారు. భూ సేకరణ పూర్తయిన తర్వాత నిర్మాణం-నిర్వహణ-బదిలీ (బీఓటీ) విధానంలో స్టూడియోలను నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అంతేకాకుండా, స్టూడియోలు నిర్మించేందుకు ముందుకొచ్చే ప్రైవేటు వ్యక్తులకు కూడా భూములు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మరోవైపు, సినిమా టికెట్ల ధరల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఈ నెల 14న చివరిసారి సమావేశం కానుంది. ఈ భేటీలో ఖరారు చేయనున్న నివేదిక ఆధారంగా ఈ నెలాఖరులో టికెట్ల ధరలపై జీవోను జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, ఐదు ఆటల విధానంలో ఉదయం 8 గంటలకు తొలి ఆట, రాత్రి 8 గంటలకు చివరి ఆట ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Andhra Pradesh
Visakhapatnam
Rajamahendravaram
Tirupati

More Telugu News