Rabia Sidhu: మా నాన్న గెలవాలి... అప్పుడే నా పెళ్లి: సిద్ధూ కుమార్తె

Sidhu daughter campaigns for her father
  • పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి
  • కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు
  • సీఎం చన్నీ వర్సెస్ సిద్ధూ!
  • తండ్రి తరఫున ఎన్నికల ప్రచారంలో రబియా సిద్ధూ

పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలతో సతమతమవుతోంది. సీఎం చరణ్ జిత్ చన్నీ, పీసీసీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, సిద్ధూ కుమార్తె రబియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి సిద్ధూ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ కోసం 14 ఏళ్లు శ్రమించారని, పంజాబ్ ను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.

అయితే, పంజాబ్ సీఎం అభ్యర్థి చన్నీ అవినీతిపరుడని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే, ఇవాళ అతడి బ్యాంకు ఖాతాలో రూ.133 కోట్లు ఎలా వచ్చాయని రబియా ప్రశ్నించారు. ఆయన ఖాతాను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన తండ్రి సిద్ధూ గెలిచేంతవరకు పెళ్లి చేసుకోనని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి భారీ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఒత్తిళ్ల కారణంగా చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటుందని, కానీ నిజాయతీ పరుడైన వ్యక్తి (సిద్ధూ)ని ఎంతోకాలం అడ్డుకోలేరని రబియా వ్యాఖ్యానించారు. ఆమె తండ్రికి మద్దతుగా అమృత్ సర్ (తూర్పు) నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News