Perni Nani: చిరంజీవి ఎంతో కృషి చేశారు.. ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాం: పేర్ని నాని

Chiranjeevi worked hard to bring film industry problem to govt says Perni Nani
  • జగన్ తో భేటీ అయిన సినీ ప్రముఖులు
  • ఏపీలో కూడా షూటింగులు జరపాలని జగన్ కోరారన్న పేర్ని నాని
  • ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయాన్నైనా చేస్తామని జగన్ హామీ ఇచ్చారని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్ తో చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, ఆర్. నారాయణమూర్తి, రాజమౌళి, కొరటాల శివ తదితరులు భేటీ అయ్యారు. సమావేశానంతరం మీడియాతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇండస్ట్రీకి సంబంధించి అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు.

సినీ పరిశ్రమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకురావడానికి చిరంజీవి ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం తరపున ఆయనను అభినందిస్తున్నామని చెప్పారు. ఒక రిలీఫ్ తీసుకొచ్చేందుకు చిరంజీవి కృషి చేశారని చెప్పారు.

ఏపీలో కూడా షూటింగులు జరపాలని సినీ ప్రముఖులను జగన్ కోరారని పేర్ని నాని తెలిపారు. విశాఖలో పెద్ద ఎత్తున షూటింగులు జరిగేలా చూడాలని... అవసరమైతే ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్ధమని చెప్పారని వెల్లడించారు. ఈ సందర్భంగా తమకు హైదరాబాద్ ఎంతో ఏపీ కూడా అంతేనని సినీ ప్రముఖులు చెప్పారని... వారికి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు.

చిన్న సినిమాల గురించి ఆర్. నారాయణమూర్తి తన ఆవేదనను సీఎంకు తెలియజేశారని పేర్ని నాని చెప్పారు. చిన్న సినిమాల విషయంలో తామంతా కలిసి మాట్లాడుకుంటామని సినీ ప్రముఖులు చెప్పారని అన్నారు.
Perni Nani
Jagan
YSRCP
Chiranjeevi
Tollywood

More Telugu News