Indian Railways: ‘అల.. మేఘాలలో’ ప్రపంచంలోనే ఎత్తైన రైల్ బ్రిడ్జి.. మనోహర దృశ్యాన్ని పంచుకున్న భారత రైల్వే.. ఇవిగో ఫొటోలు

Railway Unveiled Worlds Highest Arch Bridge On Clouds
  • జమ్మూకశ్మీర్ లోని రియాసీలో నిర్మాణం
  • చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో వంతెన
  • ఈ ఫిల్ టవర్ కన్నా ఎత్తు 35 మీటర్లు ఎక్కువ
  • 266 కిలోమీటర్ల గాలులనూ తట్టుకునే శక్తి
  • 8 తీవ్రతతో భూకంపం వచ్చినా చెక్కుచెదరదు
‘మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూఫానులా రేగిపొమ్మన్నది’ అంటూ అప్పట్లో ఓ కవి వర్ణించాడు. అవును మరి, అల్లంత ఎత్తులో పాల తరగల్లాంటి మేఘాల్లో ఎగిరిపోతుంటే వచ్చే ఆ అనుభూతి ఎంత మధురంగా ఉంటుందో కదా! అలాంటి అనుభూతిని కల్పించేందుకు భారత రైల్వే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఓ రైల్వే వంతెనను కట్టేస్తోంది.

జమ్మూకశ్మీర్ లోని రియాసీలో చినాబ్ నదిపై కొండలను కలుపుతూ ఆ వంతెనను నిర్మిస్తోంది. మేఘాల పునాదులపై ఆవిష్కృతమైన ఆ ముగ్ధ మనోహర దృశ్య కావ్యాన్ని భారత రైల్వే అందరితో పంచుకుంది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఓ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


2002లో ప్రారంభమైన ఈ ‘ఆర్చ్ బ్రిడ్జి’ నిర్మాణం పూర్తి కావస్తోంది. నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ ‘చినాబ్ రైలు వంతెన’ను నిర్మిస్తున్నట్టు రైల్వే తెలిపింది. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎక్కువ ఎత్తుండే ఈ వంతెనను.. రియాసీలోని బక్కల్, కౌరీ మధ్య నిర్మిస్తున్నారు. కశ్మీర్ లోయకు దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడంలో ఈ వంతెనది కీలకపాత్ర అని చెబుతుంటారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్ లో భాగమైన ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లాకు లింక్ చేసేస కత్రా, బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల స్ట్రెచ్ ను ఈ రైల్వే బ్రిడ్జి లింక్ చేస్తుంది.


ఈ వంతెనను 1,315 మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. ఆర్చ్ పై రైల్వే ట్రాక్ నిలబడేలా 17 ఇనుప పిల్లర్లతో రైల్ బ్రిడ్జిని కడుతున్నారు. ఆర్చ్ పొడవే 476 మీటర్లుంటుంది. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకుని ఈ వంతెన నిలబడుతుంది. కాగా, ఈ ఫొటోలను రైల్వే శాఖ పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదో సివిల్ ఇంజనీరింగ్ అద్భుతమని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. భూమి మీదకు స్వర్గం దిగొచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు.

Indian Railways
Rail Bridge
Jammu And Kashmir
Reasi
Chenab

More Telugu News