Sarayu: యూట్యూబర్ సరయును రెండో రోజూ విచారించిన పోలీసులు

 Banjara Hills Police interrogated YouTuber Sarayu consecutive second day
  • హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా లఘు చిత్రాన్ని నిర్మించారంటూ ఫిర్యాదు
  • సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు
  • వరుసగా నిన్న రెండో రోజు కూడా కొనసాగిన విచారణ

యూట్యూబర్ సరయు రూపొందించిన ఓ లఘు చిత్రం హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు రెండో రోజూ ఆమెను విచారించారు. సినీ నటి, యూట్యూబర్ అయిన వేమూరి నాగశ్వేత సరయు (36), ఆమె ‘7ఆర్ట్స్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్’ కోసం వీరు ఒక లఘు చిత్రాన్ని రూపొందించి గతేడాది ఫిబ్రవరి 25న తన చానల్‌తోపాటు సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఇందులో సరయు, ఆమె బృందం సభ్యులు తలకు ‘గణపతి బొప్పా మోరియా’ అని రాసి ఉన్న బ్యాండు ధరించారు. ఈ వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందని, అంతేకాకుండా మద్యం తాగి హోటల్‌కు వస్తారన్న ప్రచారం కూడా జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ నాయకులు  సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోను హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో చిత్రీకరించినట్టు తేలడంతో కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సరయు, లఘుచిత్ర దర్శక నిర్మాత బీరం శ్రీకాంత్‌రెడ్డి (36), జూనియర్ ఆర్టిస్టులు కృష్ణమోహన్ అలియాస్ సత్యకృష్ణ (27), గణపాక కార్తీక్ (20)లను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం నోటీసులిచ్చి విడిచిపెట్టారు. నిన్న రెండో రోజు కూడా వారిని విచారించినట్టు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శివచంద్ర తెలిపారు.

  • Loading...

More Telugu News