Chinna Jeeyar Swamy: జగన్ ఒక యంగ్ బాయ్... అవునా? కాదా?.. అని జగన్ నే అడిగిన చిన్నజీయర్ స్వామి!
- ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ది వేడుకలు
- హాజరైన ఏపీ సీఎం జగన్
- సాదరంగా స్వాగతం పలికిన చిన్నజీయర్
- జగన్ పై పొగడ్తల జల్లు
ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం జగన్ సంప్రదాయ పంచెకట్టులో ఆశ్రమానికి విచ్చేశారు. ఆయన వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా ఉన్నారు. కాగా ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో చిన్నజీయర్ స్వామి ఆసక్తికరంగా ప్రసంగించారు. "సీఎం జగన్ ఓ యంగ్ బాయ్" అంటూ పేర్కొన్నారు. అవునా కాదా? అంటూ చమత్కారంగా జగన్ ను అడగ్గా, జగన్ తనదైన శైలిలో చిరునవ్వులు చిందించారు.
అంతేకాదు, ఈ సందర్భంగా సీఎం జగన్ పై చిన్నజీయర్ పొగడ్తల జల్లు కురిపించారు. "జగన్ కు ఆస్తి ఉంది, చదువు ఉంది, అధికారం ఉంది, ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు... సాధారణంగా అయితే ఇవన్నీ ఉన్నవాళ్ల కళ్లు ఎక్కడకి ఎక్కుతాయో అందరికీ తెలుసు. కానీ జగన్ మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి. ఆయనలో ఏమాత్రం గర్వంలేదు" అని కొనియాడారు. ఏమాత్రం అహం తలకెక్కించుకోండా, ప్రజాపాలనలో తన ఆలోచనలను అమలు చేయడంపైనే దృష్టి పెడుతున్నారని అభినందించారు.
ఇక, ఇవాళ్టి కార్యక్రమాల్లో భాగంగా రాకేశ్ చౌరాసియా వేణుగానం ఏర్పాటు చేశామని, మీకు ఇలాంటి కార్యక్రమాలు నచ్చుతాయా? అని చిన్నజీయర్ స్వామి సీఎం జగన్ ను వేదికపై మర్యాదపూర్వకంగా అడిగారు. అందుకు జగన్ జవాబివ్వడంతో, చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ, 'నచ్చుతాయని సీఎం జగన్ చెప్పారు' అని వెల్లడించారు. ఆపై ఇరువురు పక్కపక్కనే ఆసీనులై సంగీత కార్యక్రమాన్ని ఆస్వాదించారు.