Santishree Dhulipudi Pandit: జేఎన్ యూ వైస్ చాన్సలర్ గా తొలిసారి మహిళకు అవకాశం... కొత్త వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి

Santishree Dhulipudi Pandit appointed as JNU new Vice Chancellor

  • యూజీసీ చైర్మన్ గా వెళ్లిన జగదీశ్ కుమార్
  • ఐదేళ్ల పాటు కొనసాగనున్న శాంతిశ్రీ 
  • జేఎన్ యూలో ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి   
  • గతంలో యూజీసీ సభ్యురాలిగా వ్యవహరించిన శాంతిశ్రీ  

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి తొలిసారి ఓ మహిళ వైస్ చాన్సలర్ గా వ్యవహరించనున్నారు. జేఎన్ యూ కొత్త వైఎస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ నియమితులయ్యారు. శాంతిశ్రీ ధూళిపూడి జేఎన్ యూ వీసీ బాధ్యతల్లో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎం. జగదీశ్ కుమార్ ఇటీవలి వరకు జేఎన్ యూ వైఎస్ చాన్సలర్ గా కొనసాగారు. ఆయన కొన్నిరోజుల కిందటే యూజీసీ చైర్మన్ గా వెళ్లడంతో ఆ పదవి ఖాళీ అయింది. జగదీశ్ కుమార్ తెలుగు వ్యక్తి. ఆయన ఖాళీ చేసిన జేఎన్ యూ వీసీ పోస్టులో ప్రథమంగా ఓ మహిళ రావడం విశేషం.

శాంతిశ్రీ ఇప్పటివరకు పూణేలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆమె వయసు 59 సంవత్సరాలు. జేఎన్ యూలోనే విద్యాభ్యాసం చేసి ఇప్పుడా అత్యున్నత విద్యాసంస్థకే వీసీగా వచ్చారు.

శాంతిశ్రీ రష్యాలో జన్మించారు. ఆమె తల్లి లెనిన్ గ్రాడ్ ఓరియెంటల్ ఫ్యాకల్టీ డిపార్ట్ మెంట్ లో తెలుగు, తమిళం ప్రొఫెసర్. శాంతిశ్రీ ధూళిపూడి చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో పీజీ వరకు చదివారు. ఆ తర్వాత జేఎన్ యూలో ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేశారు. గోవా వర్సిటీలో ఉద్యోగ ప్రస్థానాన్ని ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగారు. అంతేకాదు, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా 29 మంది పీహెచ్ డీ స్కాలర్లకు మార్గదర్శిగా వ్యవహరించారు. గతంలో ఆమె యూజీసీ సభ్యురాలిగానూ కొనసాగారు.

Santishree Dhulipudi Pandit
Vice Chancellor
JNU
Jagadish Kumar
  • Loading...

More Telugu News