Linda McAlister: భర్తను ఆన్ లైన్ లో వేలం వేసిన మహా ఇల్లాలు!

Wife put husband for auction
  • భర్తతో విసిగిపోయిన న్యూజిలాండ్ మహిళ
  • తమను పట్టించుకోవడంలేదని అసంతృప్తి
  • తనను, పిల్లలను వదిలి చేపలు పట్టేందుకు వెళ్లాడని ఆగ్రహం
  • 25 డాలర్ల కనీస ధరతో వేలం

కట్టుకున్న భర్తను వేలం వేసిన ఓ మహిళ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె వేలం వేసింది సరే... ఆమె భర్తను కొనుక్కోవడానికి మహిళలు ఎగబడడం మరింత ఆశ్చర్యం కలిగించే అంశం. న్యూజిలాండ్ లో నివసించే లిండా మెక్ అలిస్టర్ అనే ఇల్లాలు తన భర్త జాన్ ను అమ్మేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం 'ట్రేడ్ మీ' అనే వెబ్ సైట్ లో వేలం వేసింది. తన భర్తకు చెందిన పూర్తి వివరాలతో ప్రకటన ఇచ్చింది.

వ్యవసాయం, చేపలు పట్టడం అతని వృత్తి అని తెలిపింది. అయితే, భార్య, పిల్లల కంటే అతడికి బీర్ అంటేనే ఇష్టమని వెల్లడించింది. విహార యాత్రలకు వెళ్లడం అంటే ఎంతో మక్కువ అని పేర్కొంది. గుణవంతుడే అయినా, కొన్ని సమయాల్లో తాగుతుంటాడని వివరించింది.  కొనుగోలు చేయాలనుకున్న వారు వేలంలో పాల్గొనాలని పేర్కొంది. కాగా, లిండా తన భర్త జాన్ కనీస ధరను 25 డాలర్లుగా పేర్కొంది.

లిండా ఐర్లాండ్ జాతీయురాలు. అయితే భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజిలాండ్ లో నివసిస్తోంది. లిండా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం... ఓసారి అతగాడు భార్యను, పిల్లలను వదిలి చేపలు పట్టడానికి వెళ్లడమేనట. తమను అంత నిర్లక్ష్యంగా చేస్తున్న అతడిని వదిలించుకోవాలని లిండా వేలం వెబ్ సైట్ ను ఆశ్రయించింది. ఒకసారి కొనుగోలు చేసిన వారు తిరిగి ఇచ్చేయడం కుదరదని స్పష్టం చేసింది.

అయినప్పటికీ అతడిని కొనుగోలు చేసేందుకు చాలామంది మహిళలు ఆసక్తి చూపిస్తున్నారట. జాన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పాలంటూ లిండాను కోరుతున్నారట. మరి ఆ భర్తను ఏ మహిళ కొనుక్కుంటుందో చూడాలి.

  • Loading...

More Telugu News