Reliance Jio: ముంబై ప్రజలను ఇబ్బంది పెట్టిన జియో.. 8 గంటల పాటు పనిచేయని నెట్ వర్క్

Reliance Jio faces over 8 hour outage in Mumbai
  • శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సమస్య
  • రాత్రి 8 తర్వాత సేవలు అందుబాటులోకి
  • క్షమాపణలు చెప్పిన జియో
  • సమస్య ఏంటో చెప్పని సంస్థ

దేశంలో అతిపెద్ద టెలికం నెట్ వర్క్ అయిన రిలయన్స్ జియో ముంబై ప్రజలను ఒక రోజంతా అయోమయానికి గురి చేసింది. శనివారం ఏకంగా 8 గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబైలో ఈ పరిస్థితి తలెత్తడంతో భారీ సంఖ్యలో యూజర్లు ఇబ్బందుల పాలయ్యారు.

శనివారం మధ్యాహ్నం నుంచి జియో నెట్ వర్క్ లో సమస్య ఏర్పడింది. తిరిగి రాత్రి 8 తర్వాత సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి వరకు యూజర్లు కాల్స్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు వారి మొబైల్స్ కు కాల్స్ కూడా రాలేదు. ముంబై సర్కిల్ పరిధిలో జియోకు 1.30 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.

సాధారణంగా టెలికం నెట్ వర్క్ లో ఇటువంటి సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయని, జియోలో మొదటి సారి ఈ పరిస్థితి తలెత్తినట్టు నిపుణులు అంటున్నారు. సేవలు నిలిచిపోవడం పట్ల వినియోగదారులకు రిలయన్స్ జియో క్షమాపణలు చెప్పింది. రెండు రోజుల పాటు ఉచిత సేవలను అదనంగా అందిస్తామని ప్రకటించింది.

సేవల అంతరాయం సమయంలో.. యూజర్లు కాల్స్ కోసం ప్రయత్నించినప్పుడు నెట్ వర్క్ లో రిజిస్టర్ చేసుకోలేదన్న సందేశం దర్శనమిచ్చింది. కార్యాలయాల్లో ఉన్న వారు వైఫై నెట్ వర్క్ పై వాట్సాప్ తదితర యాప్స్ ద్వారా తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News