Bheem Padayatra: ఢిల్లీలో భీమ్ పాదయాత్ర చేపట్టిన బీజేపీ... కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

Telangana BJP leaders conducts Bheem Padayatra in Delhi
  • ఇటీవల బడ్జెట్ నేపథ్యంలో కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
  • రాజ్యాంగాన్ని మార్చాలని కామెంట్
  • మండిపడుతున్న బీజేపీ నేతలు
  • తెలంగాణ భవన్ నుంచి పార్లమెంటు వరకు ర్యాలీ
కేంద్రంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే క్రమంలో రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కేసీఆర్ వ్యాఖ్యల పట్ల తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో భీమ్ పాదయాత్ర నిర్వహించారు. హస్తినలోని తెలంగాణ భవన్ నుంచి పార్లమెంటు వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ  వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఇతర బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ సభ్యసమాజం అసహ్యించుకుంటోందని పేర్కొన్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ నేతలు సిగ్గూశరం లేకుండా సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, దళితులకు సీఎం పదవి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని రాజ్యాంగం చెప్పిందా? అంటూ కండకావరంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, దళితుడ్ని సీఎం చేస్తానని ప్రకటించింది ఎవరు? అంటూ బండి సంజయ్ నిలదీశారు.

"ఎన్నికల్లో ఓడిపోయిన కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? మందు గోలీలు ఇచ్చే వ్యక్తిని రాజ్యసభకు పంపాలని రాజ్యాంగంలో ఉందా? మందులో సోడా కలిపేవాళ్లకు మంత్రి పదవులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? సచివాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఫాంహౌస్ లోనే పడుకుని పాలన చేస్తే చాలని రాజ్యాంగంలో ఉందా?

జీ హుజూర్ అని తల ఊపే వ్యక్తికి హోంమంత్రి పదవి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?  ఖజానా నింపుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేయాలని రాజ్యాంగంలో ఉందా? ప్రజలపై మోయలేనంత పన్నుల భారం మోపి ఆ సొమ్ముతో నిజాం నవాబులా జల్సాలు చేయాలని రాజ్యాంగంలో ఉందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇవన్నీ లేవు కాబట్టే రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నావా?" అంటూ కేసీఆర్ పై బండి సంజయ్ ప్రశ్నల జడివాన కురిపించారు.

మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని, సీఎం కేసీఆర్ ని అని స్పష్టం చేశారు. తిరగరాయాల్సింది రాజ్యాంగాన్ని కాదు... దళిత, గిరిజన, బలహీన వర్గాలను ద్వేషించే కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేసి తెలంగాణ చరిత్రను తిరగరాయాలని తెలిపారు.
Bheem Padayatra
BJP
Bandi Sanjay
KCR
New Delhi

More Telugu News