CM Stalin: ప్లకార్డుతో నిలుచున్న ఏపీ యువకుడు... కాన్వాయ్ ఆపిన తమిళనాడు సీఎం స్టాలిన్

Tamilnadu CM Stalin stops his convoy for a Telugu youth
  • అసెంబ్లీకి వెళుతుండగా యువకుడ్ని చూసిన స్టాలిన్
  • "సీఎం సర్ ప్లీజ్ హెల్ప్ మీ" అంటూ ప్లకార్డుపై ఉన్న వైనం
  • నీట్ మినహాయింపులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాలని వినతి
ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తన పంథా చాటుకున్నారు. రోడ్డు పక్కన "సీఎం సర్ ప్లీజ్ హెల్ప్ మీ" అనే ప్లకార్డుతో నిల్చున్న ఓ యువకుడ్ని చూసి తన కాన్వాయ్ ఆపేశారు. ఇవాళ ఉదయం సీఎం స్టాలిన్ తన నివాసం నుంచి అసెంబ్లీకి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది.

ఆయన కాన్వాయ్ టీటీకే రోడ్డు వద్దకు వచ్చేసరికి అక్కడ ఓ యువకుడు సాయం చేయాలంటూ ప్లకార్డుతో దర్శనమిచ్చాడు. వెంటనే తన కారు ఆపాలని సిబ్బందికి సూచించిన సీఎం స్టాలిన్, వాహనం దిగి స్వయంగా ఆ యువకుడితో మాట్లాడారు. ఆ యువకుడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఆ యువకుడి పేరు ఎన్. సతీశ్. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందినవాడు.

ఇటీవల కొంతకాలంగా నీట్ విషయంలో సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న పోరాటానికి సతీశ్ కూడా ప్రభావితుడయ్యాడు. సీఎం స్టాలిన్ ను ఈ విషయంలో అభినందించిన సతీశ్... దేశవ్యాప్తంగా నీట్ అభ్యర్థులకు మినహాయింపులు కల్పించేలా కేంద్రాన్ని ఒప్పించాలని సీఎం స్టాలిన్ ను అర్థించాడు. దీనిపై సీఎం స్టాలిన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు సందడి చేస్తున్నాయి.
CM Stalin
Convoy
Satish
Placard
NEET
Chennai
Tamilnadu
East Godavari District
Andhra Pradesh

More Telugu News