Mekathoti Sucharitha: గుంటూరు జిన్నా టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి సుచరిత

AP Home Minister Mekathoti Sucharitha hoists tri color flag at Jinnah Tower in Guntur
  • జిన్నా టవర్ పేరు మార్చేస్తామంటున్న బీజేపీ నేతలు
  • నేడు జాతీయ జెండా ఎగురవేసిన సుచరిత
  • భారతీయులందరం ఒకటేనని ఉద్ఘాటన
తాము అధికారంలోకి వస్తే గుంటూరులోని జిన్నా టవర్ కు పేరు మార్చేస్తామని ఏపీ బీజేపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జిన్నా టవర్ కు త్రివర్ణ పతాక రంగులు వేయగా, నేడు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత జిన్నా టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గుంటూరులో జిన్నా టవర్ కు చాలా ప్రత్యేకస్థానం ఉందని, జిన్నా టవర్ కట్టే సమయానికి ఇక్కడున్న వారిలో చాలామంది పుట్టి ఉండరని అన్నారు. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు అందరం స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామని సుచరిత పేర్కొన్నారు.

భారతీయులందరూ ఒక్కటే అన్న భావనతో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సోదరభావంతో కలిసి మెలసి ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అంటూ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ చిన్నవారైనా, కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడొద్దని, ఓటు వేసినా వేయకపోయినా పథకాల లబ్ది అందరికీ అందించాలని చెబుతుంటారని ఆమె వివరించారు.

కాగా, జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తఫా, గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Mekathoti Sucharitha
Jinnah Tower
Tri Color Flag
YSRCP
Andhra Pradesh

More Telugu News