Cricket: మరో వివాదంలో గంగూలీ.. రెండుగా చీలిన బీసీసీఐ!

Ganguly Forcefully Attending Selection Committee Meetings Another Controversy Around Him
  • సెలక్షన్ కమిటీ మీటింగులకు గంగూలీ
  • వెళ్లరాదంటున్న బీసీసీఐ నిబంధనలు
  • ఇంతకన్నా దురదృష్టం ఏం ఉంటుందన్న ఓ అధికారి
  • అసలు హాజరు కాలేదంటున్న మరో అధికారి
  • హాజరయ్యారంటూ నిన్నటి ఓ ఇంటర్వ్యూ వైరల్
భారత క్రికెట్ లో ఇప్పుడిప్పుడే విరాట్ కోహ్లీ వివాదం సద్దుమణుగుతోంది. కోహ్లీని కెప్టెన్ గా తప్పించడంపై సెలక్షన్ కమిటీతో పాటు గంగూలీపై ఎన్నెన్నో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే స్థాయికి ఇప్పుడా వివాదం చేరింది. గంగూలీకి రోజులు దగ్గరపడ్డాయని క్రికెట్ లవర్స్ చర్చించుకునే స్థాయికి వెళ్లింది.

సెలక్షన్ కమిటీ సమావేశాలకు గంగూలీ వస్తున్నారని, ఇప్పటికే రెండుసార్లు హాజరయ్యారని అంటున్నారు. దీనిమీదే ఆయనపై చాలా మంది విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. బీసీసీఐ చట్టం ప్రకారం బోర్డు ప్రెసిడెంట్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరు కాకూడదని, అలాంటప్పుడు గంగూలీ ఎందుకు సెలక్షన్ సమావేశాలకు వెళ్తున్నారని కొందరు నిలదీస్తున్నారు. దీనిపై బీసీసీఐ రెండుగా చీలింది. గంగూలీ తీరును కొందరు తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం గంగూలీకి మద్దతుగా నిలుస్తున్నారు.

ఇప్పుడు బీసీసీఐ వ్యవహారాలే మారిపోయాయని, అసలు సెలక్షన్ కమిటీ మీటింగులకు గంగూలీ రావాల్సిన అవసరమేముందని ఓ అధికారి అన్నారు. ఇంతకన్నా దురదృష్టం ఏం ఉంటుందని ప్రశ్నించారు. అయితే, గంగూలీ ఎప్పుడూ సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరు కాలేదని మరి కొందరు అధికారులు చెబుతున్నారు.

అవసరం లేకపోయినా ఓ బీసీసీఐ అధికారి సెలక్షన్ కమిటీ మీటింగులకు వెళుతున్నారని, కెప్టెన్, కోచ్ నిస్సహాయులుగా మారారని పేర్కొంటూ కె.శ్రీనివాసరావు అనే జర్నలిస్టు కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేశారు. ఆ తర్వాత తాజాగా నిన్న ఓ హిందీ చానెల్ లో ప్రసారమైన ఇంటర్వ్యూలో బీసీసీఐ అధికారి ఒకరు గంగూలీ సమావేశాలకు వెళ్లేవారని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై వివాదం రాజుకున్నట్టయింది.

బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు గంగూలీపై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు. మిగతా వారిని ఎందుకంత అవమానిస్తారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే వారు ఎక్కువకాలంపాటు బీసీసీఐ పదవుల్లో కొనసాగుతారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు వారు పదవుల్లో కొనసాగాల్సి ఉన్నా.. అప్పటిదాకా అయినా ఉంటారా? అన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే గంగూలీకి రోజులు దగ్గరపడ్డాయంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
Cricket
Sourav Ganguly
Jay Shah
Virat Kohli

More Telugu News