Narendra Modi: ఇది ప్రగతిశీల బడ్జెట్... నిర్మలకు అభినందనలు: ప్రధాని మోదీ

PM Modi describes budget progressive and people friendly
  • వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందన
  • కొత్త ఆశలు, అవకాశాలు కలిగించే బడ్జెట్ అని కితాబు
  • అన్ని రంగాలకు లబ్ది చేకూరుతుందని వెల్లడి
కేంద్రం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. మొత్తం రూ.39.45 లక్షల కోట్ల బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పార్లమెంటు ముందుంచారు. ఈ బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది ప్రగతిశీల, ప్రజా స్నేహపూర్వక బడ్జెట్ అని కితాబునిచ్చారు. అన్ని రంగాలకు లబ్ది చేకూర్చే బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తన సందేశం వినిపించారు.

ఈ బడ్జెట్ ద్వారా మౌలిక వసతుల రంగంలో అనేక ఆశలకు, అవకాశాలకు మార్గం ఏర్పడిందని అన్నారు. మరిన్ని పెట్టుబడులు, మరింత అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాలు సాకారం అవుతాయని వివరించారు. 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరోనాతో సంక్షోభం తలెత్తిందని, ఇలాంటి పరిస్థితుల్లో నవ్యోత్సాహం కలిగించే బడ్జెట్ ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల తీసుకువచ్చారని కొనియాడారు.

కిసాన్ డ్రోన్లు, వందేభారత్ రైళ్లు, డిజిటల్ కరెన్సీకి ఈ తాజా బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం కల్పించామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా డిజిటల్ ఎకో సిస్టమ్ తీసుకువస్తామని చెప్పారు. అగ్రికల్చర్ స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల సులభ జీవనవిధానం కోసం మరింత కృషి చేస్తామని మోదీ వివరించారు.

దేశ ప్రజల జీవన విధానంలో అన్ని రంగాల్లో టెక్నాలజీ ప్రవేశించిందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు వచ్చాయని, బ్యాంకింగ్ రంగంలో కొత్తగా డిజిటల్ యూనిట్లు వచ్చాయని తెలిపారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని అభిలషించారు.
Narendra Modi
Budget
Nirmala Sitharaman
BJP
India

More Telugu News