Covid patients: కోవిడ్ బాధితులూ.. మీ గుండెను పదిలంగా చూసుకోండి: వైద్యుల సూచన

Covid hit Patients Must Watch Their Heart
  • గతి తప్పిన స్పందనలతో గుండె దడ
  • ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
  • తల తిరగడం వంటి సమస్యలు
  • గుండె కణజాలంపై వైరస్ ప్రభావం

కరోనా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా గత రెండు వేరియంట్లతో పాటు, ఒమిక్రాన్ లోనూ వైరస్ కారణంగా గుండె పనితీరు ప్రభావితమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

పాల్పిటేషన్ (గుండెదడ / హృదయ స్పందనల్లో వ్యత్యాసాలు) సమస్యతో ఎక్కువ మంది వైద్యులను ఆశ్రయిస్తున్నారు. గుండె కణజాలం బలహీనపడడంతో పాటు, ఇతర సమస్యలను గుర్తిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ మొదటి (ఆల్ఫా), రెండో (డెల్టా) విడతలో గుండె దెబ్బతినడం, గుండె విఫలమై మరణించిన కేసులను కూడా ప్రస్తావిస్తున్నారు.

ఒమిక్రాన్ లో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నా.. కోలుకున్న వారిలో కార్డియో మయోపతి, రక్తం గడ్డకట్టడం, పాల్పిటేషన్స్, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించే రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ‘‘మా దగ్గరకు వచ్చే బాధితుల్లో చాలా మంది శ్వాస తీసుకోవడం భారంగా అనిపిస్తోందని, గుండె దడ అని చెబుతున్నారు. కరోనా వైరస్ రక్త నాళాల్లో వాపునకు కారణమవుతోంది. దీనివల్ల బ్లడ్ క్లాట్ ఏర్పడడం జరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రావచ్చు. కనుక వారు జాగ్రత్తగా ఉండాలి’’ అని హైదరాబాద్ కు చెందిన కార్డియాలజిస్ట్ గణేష్ మంథన్ పేర్కొన్నారు.

అక్యూట్ మయోకార్డియల్ ఇంజ్యూరీకి వైరస్ కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి వైరస్ ప్రాణాంతకంగా మారుతోందని అంటున్నారు. కోలుకున్న వారు సైతం శ్వాస సమస్యలు, ఛాతీలో నొప్పి, తల తిరగడం, బలహీనతతోపాటు, గుండె దెబ్బతినే సమస్యలను ఎదుర్కొంటున్నట్టు వారు గుర్తిస్తున్నారు.

కరోనా నుంచి బయటపడిన తర్వాత మూడు నెలల వరకు ఎటువంటి కఠోర వ్యాయామాలు, కష్టమైన పనుల జోలికి వెళ్లకుండా ఉండాలన్నది వైద్యుల సూచన. నిదానంగా ప్రారంభించి, క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలని పేర్కొంటున్నారు. హార్ట్ రేటును కూడా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News