Congress: కాంగ్రెస్‌లో చేరితే డీఎస్‌పై అనర్హత వేటేద్దాం: టీఆర్ఎస్ ఎంపీలు

TRS Ready to Disqualify if DS joins congress
  • కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న డీఎస్
  • వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా
  • కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మరుక్షణం అనర్హత వేటుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం
టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరికకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. అయితే, అనుకోని కారణాలతో పలుమార్లు చేరిక వాయిదా పడింది. రేపో, మాపో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైంది. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న డీఎస్‌ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో గుర్రుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఆయనపై అనర్హత వేటు వేయించాలని నిర్ణయించింది.

ప్రగతి భవన్‌లో నిన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో టీఆర్ఎస్ సత్తా చాటాలని, అస్సలు వెనక్కి తగ్గొద్దని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దని, గట్టిగా పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాస్ ప్రస్తావన వచ్చింది.

రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం జూన్ వరకు ఉందని, కాబట్టి ఈలోపు ఆయన కనుక కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అనర్హత వేటు వేయాలన్న ప్రతిపాదనను ఎంపీలు కేసీఆర్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. అనర్హత వేటు కోసం రాజ్యసభ చైర్మన్ కి ఫిర్యాదు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చ అనంతరం డీఎస్ కాంగ్రెస్‌లో చేరిన మరుక్షణం అనర్హత వేటు కోసం ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Congress
DSR
TRS
Rajya Sabha
KCR

More Telugu News