CM KCR: టీఆర్ఎస్ ఎంపీలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

CM KCR held meeting with TRS MPs ahead of Parliament budget session
  • రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు
  • టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
  • సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ
  • 23 అంశాలతో కూడిన బుక్ లెట్ ఎంపీలకు అందజేత
రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. కాగా, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వివిధ అంశాలపై ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. నేటి సమావేశంలో ఈ నివేదికను సీఎం కేసీఆర్ ఎంపీలకు అందజేశారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలే పరమావధిగా కృషి చేయాలని సూచించారు.

సీఎం కేసీఆర్ తో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. ఈ సమావేశంలో 23 అంశాలను చర్చించామని, ఆ అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ తమకు ఓ బుక్ లెట్ అందించారని వెల్లడించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని, బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడతామని అన్నారు. విభజన అంశాలను కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు.
CM KCR
TRS MPs
Meeting
Parliament
Budget Session
Telangana

More Telugu News