Omicron: ప్రబలంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్

  • కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
  • ఒడిశా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో డెల్టా కేసులు
  • ప్రతి మూడు కేసుల్లో రెండు గతంలో కరోనా బారిన పడినవే
Omicron BA 2 substrain is more prevalent in India

ఒమిక్రాన్ లో ఉపరకమైన బీఏ.2 ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువగా విస్తరిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే ప్రస్తుతానికి డెల్టా కేసులు వెలుగు చూస్తున్నట్టు తెలిపింది.

ఇక కరోనా మూడో విడతలో నమోదవుతున్న ప్రతీ మూడు కేసుల్లో ఇద్దరు లోగడ కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడినవారు ఉంటున్నారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ బీ.1.1.529 వేరియంట్ ఎక్కువ కేసులకు కారణమైన రకం. కనుక గతంలో ఇన్ఫెక్షన్ బారిన పడిన వారికీ మళ్లీ కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఒమిక్రాన్ వైరస్ రెండోసారి వస్తున్నట్టు ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండకుండా చూసుకునేందుకు, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు టీకాలు తీసుకోవడమే మార్గమని నిపుణులు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొత్త రకాలు వచ్చినందున బూస్టర్ డోసు ద్వారా రక్షణ పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.

More Telugu News