Indian Family: అమెరికా-కెనడా సరిహద్దుల్లో మరణించిన భారతీయ కుటుంబం వివరాల వెల్లడి
- ఈ నెల 19న నాలుగు మృతదేహాల గుర్తింపు
- మంచులో కూరుకుపోయిన మృతదేహాలు
- మృతులు గుజరాత్ కు చెందినవారిగా గుర్తింపు
- బంధువులకు సమాచారం అందించిన భారత హైకమిషన్
ఈ నెల 19న అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ భారతీయ కుటుంబం మృత్యువాతపడడం తెలిసిందే. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో మంచు ధాటికి వారు మరణించారని ప్రాథమికంగా అంచనా వేశారు. వారి మృతదేహాలు సరిహద్దుకు కొద్దిదూరంలో కెనడా భూభాగంలో మంచులో కూరుకుపోయి కనిపించాయి. తాజాగా, వారు ఎవరన్నది కెనడా అధికారులు గుర్తించారు.
ఆ నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారని, వారు గుజరాత్ కు చెందిన వారని కెనడా అధికారులు వెల్లడించారు. జగదీశ్ బల్ దేవ్ భాయ్ పటేల్ (39), వైశాలి బెన్ (37) భార్యాభర్తలు కాగా, వారి పిల్లలు విహంగి పటేల్ (11), ధార్మిక్ పటేల్ (3) మరణించారని తెలిపారు. జగదీశ్ పటేల్ కుటుంబం ఈ నెల 12న కెనడాలోని టొరంటో చేరుకుని అక్కడి నుంచి 18వ తేదీన అమెరికా సరిహద్దుల వద్దకు బయల్దేరినట్టు కెనడా అధికారులు గుర్తించారు. మానవ అక్రమరవాణా ముఠా సభ్యులు సరిహద్దుల వద్దకు తీసుకువచ్చి ఉంటారని భావిస్తున్నారు.
కాగా, జగదీశ్ పటేల్ కుటుంబం మృతిపై కెనడాలోని భారత హైకమిషన్ వర్గాలు స్పందించాయి. వారి బంధువులకు సమాచారం అందించాయి. త్వరలో మృతదేహాలను భారత్ కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు హైకమిషన్ పేర్కొంది.
ప్రపంచంలోని లక్షలాదిమందికి అమెరికా స్వర్గధామంలా కనిపిస్తుంటుంది. దాంతో కొందరు అక్రమ మార్గాల్లోనైనా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా అమెరికాతో సరిహద్దులు పంచుకునే కెనడా వైపు నుంచి ఈ తరహా అక్రమ వలసలు అధికంగా ఉంటాయి.