CM Ibrahim: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ.. కేంద్ర మాజీ మంత్రి ఇబ్రహీం గుడ్ బై!

Former Union Minister CM Ibrahim Quits Congress Party
  • కాంగ్రెస్ కు కేంద్ర మాజీ మంత్రి ఇబ్రహీం గుడ్ బై
  • మండలిలో విపక్ష నేత పదవిని ఇవ్వకపోవడంతో అసహనం
  • జేడీఎస్ లోకి వస్తే ఆహ్వానిస్తామన్న కుమారస్వామి
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తనను కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కర్ణాటక శాసనమండలిలో విపక్ష నేత పదవిని తనకు ఇవ్వాలని ఇబ్రహీం చాలా కాలంగా కోరుతున్నారు. అయితే, ఆయనకు ఆ పదవిని ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాయి.

మండలిలో విపక్ష నేతగా బీకే హరిప్రసాద్ ను కాంగ్రెస్ నిన్న నియమించింది. దీంతో ఆ పార్టీకి ఇబ్రహీం గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఇబ్రహీం మాట్లాడుతూ, హరిప్రసాద్ తనకంటే జూనియర్ అని, ఆయన కింద తాను ఎలా పని చేయగలనని ప్రశ్నించారు.

ఇక ఇప్పుడు తనకు ఎలాంటి బాధ్యత లేదని... ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా తనకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. తన శ్రేయోభిలాషులతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఇప్పటి నుంచి తనకు కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధం లేదని... ఆ పార్టీ తన జీవితంలో ఒక ముగిసిపోయిన అధ్యాయమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా నాశనం అవుతూ వస్తోందని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. డబ్బు లేకుండా కాంగ్రెస్ లో పని చేసే నాయకుడే లేడని ఆరోపించారు. నెహ్రూ, ఇందిరల హయాంలో కాంగ్రెస్ ఒక సోషలిస్టిక్ పార్టీగా ఉండేదని... ఇప్పుడు 'లేనా బ్యాంక్'గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ నిండా మునిగిపోయిందని అన్నారు.  

దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో ఇబ్రహీం కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పని చేశారు. మరోవైపు ఇబ్రహీం మాట్లాడుతూ, దేవెగౌడను, జేడీఎస్ ను వదులుకుని తాను 2008లో కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పారు. ఇప్పుడు దేవెగౌడ, కుమారస్వామిలతో మాట్లాడి ఆ పార్టీలో చేరే విషయంలో నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

మరోవైపు కుమారస్వామి మాట్లాడుతూ ఇబ్రహీంతో తమకు సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందని... ఆయన ఎప్పుడు వచ్చినా పార్టీలోకి స్వాగతిస్తామని చెప్పారు. గతంలో ఇబ్రహీంతో తాను మాట్లాడానని... విపక్ష నేతగా అవకాశం ఇస్తే కాంగ్రెస్ లోనే కొనసాగాలని చెప్పానని, ఇవ్వకపోతే బయటకు వచ్చేయాలని చెప్పానని అన్నారు.
CM Ibrahim
Congress
Quit

More Telugu News