Cricket: కోహ్లీ వల్లే క్రికెట్ కు గౌరవం పెరిగింది.. ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ ఆసక్తికర వ్యాఖ్యలు
- నాయకుడిగా జట్టులో స్ఫూర్తి నింపుతాడు
- ఆటకు అతడో గొప్ప రాయబారి
- టెస్ట్ క్రికెట్ ను బతికించిన కోహ్లీకి థ్యాంక్స్ చెప్పాలన్న వార్న్
నాయకుడిగా ప్రతి ఒక్కరికీ విరాట్ కోహ్లీ ప్రేరణ అని ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కొనియాడాడు. ఆటమీద అతడికున్న నిబద్ధతతే టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెరిగేలా చేసిందని చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వార్న్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘విరాట్ కోహ్లీ ఓ మంచి నాయకుడు. జట్టు సభ్యుల్లో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతాడు. వ్యూహాల అమలులో కొంత మెరుగవ్వాల్సి ఉన్నా.. నాయకుడిగా మాత్రం అందరికీ ఆదర్శం’’ అని వివరించాడు. ‘బుక్ మై షో’ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలో ఇటీవల విడుదలైన తన డాక్యుమెంటరీ ‘షేన్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ కామెంట్లు చేశాడు.
అతడి వల్లే టెస్ట్ క్రికెట్ కు ఎంతో గౌరవం, ఆదరణ పెరిగాయని అన్నాడు. కోహ్లీ అంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నాడు. ‘‘అతడో గొప్ప ఆటగాడు. ఆటకే గొప్ప రాయబారి. కాబట్టి టెస్ట్ క్రికెట్ ను ఇంత ముందుకు తీసుకెళ్లిన కోహ్లీకి, బీసీసీఐకి మనమంతా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికీ టెస్ట్ క్రికెటే నెంబర్ 1’’ అని షేన్ వార్న్ పేర్కొన్నాడు.
కోహ్లీ, బీసీసీఐ ముందుకొచ్చి టెస్ట్ క్రికెట్ ను బతికించి ఉండకపోతే.. చాలా దేశాలు ఆ ఫార్మాట్ నే వదిలేసేవన్నాడు. క్రికెట్ లో సత్తా ఏంటో తెలియాలంటే టెస్ట్ క్రికెట్ ఆడాల్సిందేనన్నాడు.