Road Accident: మహారాష్ట్రలో డివైడర్‌ను ఢీకొని వంతెన పైనుంచి కిందపడిన కారు.. ఏడుగురు వైద్య విద్యార్థుల దుర్మరణం.. మృతుల్లో ఎమ్మెల్యే ఏకైక కుమారుడు

dreaded accident in maharashtras wadhra 7 medical students died
  • యావత్‌మాల్ నుంచి వార్దాకు వెళ్తుండగా ఘటన
  • మృతులందరూ సవాంగి మెడికల్ కాలేజీ విద్యార్థులే
  • మృతుల్లో తిరోడా ఎమ్మెల్యే విజయ్ కుమారుడు
మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సావంగిలోని దత్తా మేఘే మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు యావత్‌మాల్ నుంచి వార్ధాకు కారులో వెళ్తుండగా గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంటన్నర సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

సెల్సురా వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీంతో అది అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడి నుజ్జునుజ్జు అయింది. దీంతో విద్యార్థులందరూ అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్ వార్దా చేరుకోగానే పోలీసులకు సమాచారం అందించాడు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు ప్రారంభించారు. మృతుల్లో గోండ్యా జిల్లా తిరోడా బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ ఏకైక కుమారుడు ఆవిష్కర్ రహంగ్‌డేల్ ఉన్నట్టు  గుర్తించారు. మరోవైపు, ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసుల రాకకుముందే విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే వారంతా మరణించినట్టు చెప్పారు. కాగా, మృతి చెందిన ఏడుగురు విద్యార్థుల మృతదేహాలను పోలీసులు సావంగి మెడికల్ కాలేజీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident
Maharashtra
Wadhra
Medical Students

More Telugu News