Opinion Polls: ఒపీనియన్ పోల్స్ ప్రసారాలను నిషేధించాలని కోరిన సమాజ్ వాదీ పార్టీ

sp demands ban on Opinion Polls Ahead Of UP Elections
  • పక్షపాతంతో కూడిన సర్వేలు
  • ప్రజలను అయోమయానికి గురి చేస్తాయి
  • తీర్పు పై ప్రభావం చూపిస్తాయి
  • ఈసీకి ఎస్పీ లేఖ
ఒపీనియన్ పోల్స్ పట్ల సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అసహనం వ్యక్తం చేసింది. వెంటనే సర్వే ప్రసారాలను నిషేధించాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ)ను డిమాండ్ చేసింది. వచ్చే నెలలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు మొదలు కానుండడం తెలిసిందే. దీంతో పలు జాతీయ మీడియా సంస్థలు, పరిశోధనా సంస్థలతో కలసి ఓటర్ల అభిప్రాయాల ఆధారంగా ఏ పార్టీకి విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయనేది ఫలితాల రూపంలో ప్రసారం చేస్తున్నాయి.

మెజారిటీ ఒపీనియన్ పోల్స్ బీజేపీకే అధికారం తిరిగి దక్కుతుందని, ఎస్పీ గతంతో పోలిస్తే బలం పుంజుకుంటుందని వెల్లడించాయి. బీజేపీ ఆధిపత్యం కొంత తగ్గొచ్చని అంచనా వేశాయి. దీంతో ఈ తరహా ప్రసారాలు, ప్రచారం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తాయని ఎస్పీ ఆందోళన చెందింది. ఈ విషయమై ఈసీకి లేఖ రాసింది.

‘‘యూపీలో చివరిదైన ఏడో విడత ఓటింగ్ మార్చి 7న జరుగుతుంది. ఫలితాలు 10న వెలువడతాయి. అయినప్పటికీ కొన్ని న్యూస్ చానళ్లు ఒపీనియన్ పోల్స్ ఫలితాలను చూపిస్తున్నాయి. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. ఓటర్లను అయోమయానికి గురి చేసి, పోలింగ్ ను ప్రభావితం చేస్తాయి’’ అంటూ సీఈసీకి యూపీ ఎస్పీ చీఫ్ నరేశ్ ఉత్తమ్ పటేల్ లేఖ రాసినట్టు పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి ప్రకటించారు. పక్షపాతంతో కూడిన పోల్స్ ను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.

ఎస్పీ లేఖపై బీజేపీ యూపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి స్పందించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ లో నిరాశకు ఇది అద్దం పడుతోందన్నారు. ‘‘కొన్ని సందర్భాల్లో ఈసీ నిష్పాక్షికతను ఆయన ప్రశ్నిస్తారు. కొన్ని సందర్భాల్లో డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు సర్వేలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రజాదరణ చూసి ఆయన చలించినట్టున్నారు’’ అని పేర్కొన్నారు.
Opinion Polls
ban
up
elections
ec
sp
bjp

More Telugu News