Andhra Pradesh: జగన్‌పై ట్విట్టర్‌లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై పోలీసుల రిమాండ్ నివేదిక.. ఆ సెక్షన్లు చెల్లవని, ఫణిని విడుదల చేయాలని కోర్టు ఆదేశం

Guntur Court rejects Phani remand report
  • సీఎం జగన్‌ను చంపేస్తానంటూ పోస్టులు
  • పవన్ ఫణిని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు
  • రాజద్రోహం వంటి తీవ్రమైన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవన్న న్యాయమూర్తి
  • సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ట్విట్టర్‌లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై పోలీసులు నమోదు చేసిన రిమాండ్ నివేదికను కోర్టు తిరస్కరించింది. మానవబాంబులా మారి సీఎం జగన్‌ను చంపేస్తానంటూ రాజమహేంద్రవరానికి చెందిన పవన్ ఫణి ట్విట్టర్‌లో బెదిరింపు పోస్టు పెట్టాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా, ప్రజల మధ్య గొడవలు సృష్టించేలా, శాంతి భద్రతల సమస్యకు దారితీసేలా ఫణి ఉద్దేశపూర్వకంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ నమోదు చేసిన రిమాండ్ నివేదికను గుంటూరులోని ఆరో అదనపు కోర్టు ఇన్‌చార్జ్ న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ ఎదుట సమర్పించారు.

నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితుడు ఫణిపై నమోదు చేసిన నేరాలు సరిగా లేవన్నారు. 121, 124ఏ రాజద్రోహంతోపాటు పలు తీవ్రమైన సెక్షన్లు బనాయించారని, అవి ఈ కేసుకు వర్తించవని స్పష్టం చేశారు. మరికొన్ని ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కూడా ఉన్నాయని పేర్కొంటూ రిమాండ్ నివేదికను తిరస్కరించారు. నిందితుడు ఫణికి నోటీసులు ఇచ్చి సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆయనను విడిచిపెట్టారు.
Andhra Pradesh
YS Jagan
Twitter
Court
Police

More Telugu News