ఐపీఎల్ 2022 భారత్ లోనా? దక్షిణాఫ్రికాలోనా?.. నేడు జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం
- ప్లాన్ ఏ కింద భారత్ లోనే
- ముంబై, నవీ ముంబై, పూణెలో
- ఒకవేళ కుదరకపోతే ప్లాన్ బి
- దక్షిణాఫ్రికాలో మ్యాచుల నిర్వహణ
వీలైనంత వరకు స్థానికంగానే నిర్వహించాలని, లేదంటే దక్షిణాఫ్రికాకు వేదిక తరలించాలని ఐపీఎల్ గవర్నింగ్ బోర్డు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకానీ, గత రెండు సీజన్ల మాదిరిగా యూఏఈకి వెళ్లకూడదన్న అభిప్రాయంతో ఉంది. ఎప్పుడూ ఒకటే విదేశీ వేదికను నమ్ముకోవడం సరికాదని భావిస్తోంది. పైగా గత రెండు సీజన్లకు రూ.150 కోట్లు (2020లో రూ.100 కోట్లు, 2021లో రూ.50కోట్లు) చెల్లించింది. అంత ఖర్చు కూడా సరికాదన్న అభిప్రాయంతో ఉంది.
గతంలో ఐపీఎల్ 2009 సీజన్ ను దక్షిణాఫ్రికాలోనే నిర్వహించారు. అప్పుడు ఎటువంటి అవరోధాల్లేకుండా విజయవంతంగా పూర్తయింది. ఐపీఎల్ 2022 సీజన్ కు ప్లాన్ ఏ కింద స్థానికంగానే ముంబై, నవీ ముంబై, పూణెలో నిర్వహించాలన్నది ప్రణాళిక. లేదంటే ప్లాన్ బి కింద దక్షిణాఫ్రికాకు వెళ్లాలన్నది యోచన. దీనిపై నేటి సమావేశంలో స్పష్టత రానుంది. అలాగే, 2023 నుంచి ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్ టెండర్ పైనా ఫ్రాంచైజీలకు స్పష్టత నిచ్చే అవకాశం ఉంది.