Black Diamond: వందల కోట్ల సంవత్సరాల క్రితం నక్షత్రమండలం నుంచి ఊడిపడిన అరుదైన ‘నలుపు’ వజ్రం.. వేలానికి రెడీ!

The Rarest Black Diamond Which Comes From Interstellar
  • 2006లోనే దాని పేరిట గిన్నిస్ రికార్డ్
  • తొలిసారిగా దుబాయ్ లో ప్రదర్శనకు
  • తర్వాత లాస్ ఏంజిలిస్, లండన్ లో ప్రదర్శన
  • వచ్చే నెల 3న ఆన్ లైన్ లో సోతెబీ వేలం
ఇప్పటిదాకా మనం పింక్ డైమండ్, నీలి వజ్రం, ఆకుపచ్చ వజ్రాలను చూసి ఉంటాం. మరి, ఎప్పుడైనా నలుపు వజ్రాన్ని చూశారా? నక్షత్రమండలం నుంచి ఊడిపడిన అలాంటి ఓ అరుదైన నలుపు వజ్రాన్ని లండన్ లోని సోతెబీ అనే సంస్థ వేలం వేయనుంది. దాని పేరు ‘ఎనిగ్మా’.. బరువు 555.55 క్యారెట్లు. ఆ వజ్రాన్ని తొలిసారిగా దుబాయ్ లో ప్రజల సందర్శనార్థం ఉంచారు.

260 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఓ పెద్ద ఉల్క లేదా గ్రహశకలం భూమిని ఢీకొట్టినప్పుడు ఈ వజ్రం ఏర్పడి ఉంటుందని సోతెబీ వేలం సంస్థ జ్యువెలరీ స్పెషలిస్ట్ సోఫీ స్టీవెన్స్ చెప్పారు. ‘‘సహజసిద్ధంగా నలుపు రంగులో వచ్చిన ఇలాంటి వజ్రం చాలా అరుదు. వాటి ఉద్భవం ఇప్పటికీ మిస్టరీనే’’ అని సోతెబీ చెప్పింది. 20 ఏళ్ల క్రితం వరకు కూడా ఆ వజ్రాన్ని బయటకు తీసుకురాలేదని తెలిపింది. ఆ తర్వాత నిపుణులు 55 మొహాలతో వజ్రాన్ని రూపుదిద్దారని పేర్కొంది. శక్తి, రక్షణకు చిహ్నమైన మిడిల్ ఈస్ట్  పామ్ ఆకారంలోనే దీనిని రూపొందించారు.

కాగా, అతిపెద్ద అరుదైన నలుపు వజ్రంగా 2006లో దీనికి గిన్నిస్ రికార్డు కూడా ఉందని సోతెబీ వెల్లడించింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఈ వజ్రాన్ని.. ఆ తర్వాత లాస్ ఏంజిలిస్, లండన్ లకు తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరి 3న ఆన్ లైన్ లో వేలం నిర్వహించనున్నారు. ఇదో అంతరిక్ష అద్భుతం అని సోతెబీ పేర్కొంటోంది. వేలంలో డబ్బుతో పాటు క్రిప్టోకరెన్సీనీ తీసుకుంటామని చెప్పింది. కాగా, వేలంలో ఈ వజ్రానికి కనీసం 50 లక్షల డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
Black Diamond
Diamond
Sotheby
The Enigma

More Telugu News