Test Captain: కోహ్లీ వారసుడు ఎవరు?... తేల్చేందుకు చాలా సమయం ఉందన్న బీసీసీఐ వర్గాలు

BCCI official says more time they have to decide test captain
  • టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ
  • కొత్త కెప్టెన్ పై విస్తృతంగా చర్చ
  • పంత్ అయితే బాగుంటుందన్న గవాస్కర్
  • రాహుల్ పేరు సూచిస్తున్న మరికొందరు
టీమిండియా టెస్టు పగ్గాలను విరాట్ కోహ్లీ వదులుకున్న నేపథ్యంలో అతడి వారసుడు ఎవరన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ వైపు మొగ్గు చూపుతుండగా, మరికొందరు కేఎల్ రాహుల్ పేరు సూచిస్తున్నారు.

అటు, పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేసి చర్చను మరింత రక్తి కట్టించాడు. ఒకవేళ తనకు ఏదైనా అవకాశం వరిస్తే దాన్ని గౌరవంగా భావిస్తానని, అందరు ఆటగాళ్ల లాగే అవకాశం వస్తే స్వీకరిస్తానని, ఇతరుల కంటే తానేమీ అతీతుడ్ని కాదని పేర్కొన్నాడు. టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరన్న ప్రశ్నకు బుమ్రా పైవిధంగా బదులిచ్చాడు.

కాగా, కోహ్లీ వారసుడు ఎవరన్నదానిపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. ఇప్పటివరకు ఏ ఒక్కరి పేరు చర్చకు రాలేదని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు. టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరన్నది సెలెక్షన్ కమిటీ సిఫారసు చేస్తుందని వెల్లడించారు. అందుకు చాలా సమయం ఉందని పేర్కొన్నారు.

అంతేకాదు, ప్రస్తుతం రోహిత్ శర్మ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడని, కేఎల్ రాహుల్ కూడా రేసులో ఉన్నాడని, సెలెక్టర్లు అన్ని అంశాలు చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారని ఆ అధికారి వివరించారు. కాగా, టీమిండియా తన తదుపరి టెస్ట్ సిరీస్ ను శ్రీలంకతో ఆడాల్సి ఉంది. రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఫిబ్రవరిలో భారత్ రానుంది.
Test Captain
Virat Kohli
BCCI
Rishabh Pant
KL Rahul
Rohit Sharma

More Telugu News