Fee Regulation Act: వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం.. ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం.. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీలో నిర్ణయం

Fee Regulation Act for Telangana Educational Institutions
  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
  • వివిధ అంశాలపై విస్తృతస్థాయిలో చర్చ
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం
  • క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. తెలంగాణలో విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. అంతేకాదు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించారు.

ఈ మేరకు ఫీజుల నియంత్రణ చట్టం, ఇంగ్లిష్ మీడియం అంశాలపై అధ్యయానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సబ్ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ఇందులో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా ఉంటారు. ఫీజుల నియంత్రణ, ఇంగ్లిష్ మీడియం అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం జరిపి విధివిధానాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఈ సబ్ కమిటీకి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

నేటి క్యాబినెట్ సమావేశంలో కొవిడ్ తీవ్రతపైనా చర్చించారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంనేందుకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
Fee Regulation Act
Telangana Cabinet
English Medium
Sub Committee
CM KCR
TRS
Telangana

More Telugu News