Vaccination: దేశంలో 12 నుంచి 14 ఏళ్ల లోపు వయసు పిల్లలకు మార్చి నుంచి కరోనా టీకాలు

Corona Vaccination for children may be from March
  • ప్రస్తుతం 15-18 ఏళ్ల లోపు వారికి టీకాలు
  • ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి కానున్న వ్యాక్సినేషన్
  • ఆ తర్వాత 12-14 ఏళ్ల లోపు వారికి టీకాలు
భారత్ లో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 15 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.

జాతీయ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్.కె.అరోరా దీనిపై మాట్లాడుతూ, 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలలకు మార్చి నుంచి టీకాలు అందించే అవకాశముందని వెల్లడించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి మార్చి నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం, 15 ఏళ్లకు లోపు వారికి వ్యాక్సినేషన్ విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

దేశంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు 7.4 కోట్ల మంది ఉన్నారని, వారిలో 3.45 కోట్ల మంది తొలి డోసు తీసుకున్నారని, 28 రోజుల వ్యవధితో రెండో డోసు తీసుకుంటారని అరోరా తెలిపారు. మిగిలిన వారికి ఈ నెలాఖరు కల్లా తొలి డోసు ఇస్తామని, తద్వారా వారు ఫిబ్రవరి చివరి నాటికి రెండో డోసు కూడా తీసుకుంటారని చెప్పారు. 12 నుంచి 14 ఏళ్ల లోపు వయసు వారు దేశంలో 7.5 కోట్ల మంది ఉంటారని డాక్టర్ అరోరా సూచనప్రాయంగా తెలిపారు.
Vaccination
Children
Corona Virus
NK Arora
India

More Telugu News