Australia: ​విజయంతో యాషెస్ సిరీస్ ముగించిన ఆస్ట్రేలియా... చివరి టెస్టులోనూ గెలుపు

Australia finishes Ashes with victory against England
  • ఐదో టెస్టులో 146 పరుగుల తేడాతో ఆసీస్ విక్టరీ
  • 4-0తో సిరీస్ ముగించిన ఆస్ట్రేలియా
  • ఒక్క టెస్టు కూడా నెగ్గలేకపోయిన ఇంగ్లండ్
  • ఆసీస్ కెప్టెన్ గా కమిన్స్ కు ఇదే తొలి సిరీస్
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. చిరకాల ప్రత్యర్థులు అనదగ్గ ఈ రెండు జట్లు యాషెస్ లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిపోరాడతాయి. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్ లో ఆతిథ్య జట్టుదే పైచేయి అయింది. నేడు ముగిసిన చివరి టెస్టులోనూ ఆస్ట్రేలియానే నెగ్గింది. యువ బౌలర్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆసీస్ 146 పరుగుల తేడాతో ఐదో టెస్టులో విజయం సాధించింది.

271 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 124 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కామెరాన్ గ్రీన్ 3, స్కాట్ బోలాండ్ 3, ప్యాట్ కమిన్స్ 3, మిచెల్ స్టార్క్ 1 వికెట్ తీశారు. లక్ష్యఛేదనలో ఓ దశలో ఇంగ్లండ్ 68/0తో పటిష్టంగా కనిపించింది. అయితే 56 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి మరో పరాజయం మూటగట్టుకుంది.

ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా వరుసగా మూడు టెస్టుల్లో నెగ్గి సిరీస్ ఎప్పుడో చేజిక్కించుకుంది. ఆ తర్వాత నాలుగో టెస్టు డ్రాగా ముగియగా, ఆఖరిదైన ఐదో టెస్టులో ఆసీస్ నెగ్గింది. తద్వారా సిరీస్ ను 4-0తో ముగించింది. పేస్ బౌలర్ గా విశేష ఖ్యాతి పొందిన కమిన్స్ కు కెప్టెన్ గా ఇదే తొలి సిరీస్. అయినప్పటికీ ఎంతో పరిణతితో వ్యవహరించి జట్టును విజయపథంలో నడిపించిన వైనం విమర్శకులను సైతం ఆకట్టుకుంది.
Australia
Ashes
England
Test Series

More Telugu News