బీజేపీ వైపు చూస్తున్న ములాయం సింగ్ చిన్న కోడలు
- ములాయం చిన్న కోడలు అపర్ణాయాదవ్ చర్చలు
- టికెట్ ఇచ్చేట్టు అయితే చేరేందుకు సమ్మతి
- కొత్త స్థానంలో పోటీకి దింపాలన్నది కమలం వ్యూహం
ఇప్పుడు ఏకంగా ములాయం సింగ్ యాదవ్ ఇంటి సభ్యురాలినే తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోందన్నది తాజా సమాచారం. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్, బీజేపీకి మధ్య కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నట్టు పార్టీ వర్గాల కథనం. ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రావాల్సి ఉందంటున్నాయి.
అపర్ణా యాదవ్ 2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ సీటు నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి రీతా బహుగుణ చేతిలో 33,976 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో తనకు లక్నో కంటోన్మెట్ టికెట్ ఇచ్చేట్టు అయితే బీజేపీలో చేరి పోటీ చేయాలని అపర్ణా యాదవ్ భావిస్తున్నారు. కాకపోతే ఆమెను గతంలో పోటీ చేసిన చోట కాకుండా, వేరే స్థానం నుంచి రంగంలోకి దింపాలని బీజేపీ అనుకుంటోంది.