Bumrah: కేప్ టౌన్ టెస్టులో బుమ్రా, జాన్సెన్ మధ్య మాటల యుద్ధం... ఎవరు గెలిచారో చూడండి!

War between Bumrah and Jansen in Capte Town test

  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య చివరిటెస్టు
  • జాన్సెన్ బౌన్సర్ ఆడేందుకు బుమ్రా విఫలయత్నం
  • బంతి శరీరాన్ని తాకిన వైనం
  • బుమ్రాను రెచ్చగొట్టే యత్నం చేసిన జాన్సెన్
  • జాన్సెన్ కు అదే రీతిలో బదులిచ్చిన బుమ్రా

మూడో టెస్టు సందర్భంగా టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, దక్షిణాఫ్రికా కుర్ర బౌలర్ మార్కో జాన్సెన్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. తొలుత బుమ్రా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జాన్సెన్ ఓ బౌన్సర్ సంధించాడు. అది బుమ్రా శరీరాన్ని తాకింది. దాంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం రాజుకుంది. సై అంటే సై అంటూ ఇద్దరూ ముందుకు రావడంతో అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పాడు. ఆ తర్వాత జాన్సెన్ విసిరిన ఓ బంతిని బుమ్రా భారీ షాట్ కొట్టి ప్రతీకారం తీర్చుకున్నాడు.

అంతేకాదు, జాన్సెన్ బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో బుమ్రా పదునైన బౌన్సర్లతో విజృంభించాడు. కొన్ని బౌన్సర్ల నుంచి తప్పించుకున్న జాన్సెన్... మధ్యస్థంగా వచ్చిన ఓ బంతి నుంచి తప్పించుకోలేకపోయాడు. అది జాన్సెన్ భుజాన్ని బలంగా తాకింది.

ఆ తర్వాత కాసేపటికే ఓ అద్భుతమైన బంతితో జాన్సెన్ ఆఫ్ స్టంప్ ను బుమ్రా గిరాటేశాడు. అవమానభారంతో వెళ్లిపోతున్న జాన్సెన్ వైపు బుమ్రా సీరియస్ గా ఓ లుక్కేశాడు. కానీ జాన్సెన్ తల తిప్పిచూడకుండా పెవిలియన్ బాటపట్టాడు. అయితే, టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాత్రం పిడికిలి బిగించి చూపుతూ, తమతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందన్న రీతిలో తీవ్రంగా స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

ఇక, కేప్ టౌన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట చివరిలో ఓపెనర్ల వికెట్లు చేజార్చుకున్న భారత్ ను సఫారీ పేసర్లు రబాడా, జాన్సెన్ మరోసారి దెబ్బకొట్టారు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు 24 ఓవర్లలో 4 వికెట్లకు 70 పరుగులు. టీమిండియా ఆధిక్యం 83 పరుగులే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఎంతో ఓపికగా ఆడాల్సిన అవసరం ఉంది.

  • Loading...

More Telugu News