NV Prasad: బలిసి కొట్టుకుంటున్నది మీరే.. సినిమా వాళ్లు కాదు!: వైసీపీ ఎమ్మెల్యేపై సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఫైర్

Tollywood producer NV Prasad fires on YSRCP MLA Nallapureddy
  • సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారన్న నల్లపురెడ్డి
  • అనవసర వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చుకోవద్దన్న ఎన్వీ ప్రసాద్
  • మీడియా ముందు మాట్లాడినంత మాత్రాన హీరో అయిపోరని మండిపాటు
సినిమా టికెట్ల ధరను ఏపీ ప్రభుత్వం తగ్గించిన వ్యవహారం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న జరిపిన భేటీ కూడా ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి భోజనం చేసి వచ్చాడంటూ వర్మను పలువురు విమర్శిస్తున్నారు. మరో సినీ దర్శకుడు హరీశ్ శంకర్... వర్మపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. క్యాచ్ ఔట్ అయిన తర్వాత నేరుగా పెవిలియన్ లోకి వెళ్లి కూర్చోవాలని... గ్రౌండ్ లో డిబేట్ పెట్టొద్దని ఎద్దేవా చేశారు.

మరో వైపు పేర్ని నానితో వర్మ భేటీ అయిన సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నల్లపురెడ్డిపై సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మండిపడ్డారు. కొవ్వూరులో నల్లపురెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. నల్లపురెడ్డి కుటుంబం అంటే అందరికీ చాలా గౌరవం ఉందని... అనవసర వ్యాఖ్యలతో కుటుంబ గౌరవాన్ని దిగజార్చుకోవద్దని ఆయన అన్నారు.

మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన హీరో అయిపోరని ఎన్వీ ప్రసాద్ చెప్పారు. బలిసి కొట్టుకుంటున్నది సినిమా వాళ్లు కాదని... మీరేనని అన్నారు. సినిమా వాళ్లను అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదని అన్నారు. సినిమా నిర్మాణం ఎంత కష్టతరమో వచ్చి ప్రత్యక్షంగా చూడాలని చెప్పారు. తన సినిమా నిర్మాణ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తానని తెలిపారు. చేసిన వ్యాఖ్యలను ప్రసన్న వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
NV Prasad
Tollywood
Nallapureddy
YSRCP

More Telugu News