New Delhi: కేసులు ఈ వారంలోనే పతాకస్థాయికి వెళ్లి తగ్గుముఖం పడతాయి: ఢిల్లీ వైద్యశాఖ మంత్రి

Covid May Peak In 2 Days Dekhi
  • ఇప్పటికే గరిష్ఠాలకు చేరిన కేసులు
  • ఆసుపత్రుల్లో చేరుతున్నది కొద్ది మందే
  • తీవ్రత తక్కువగా ఉంది
  • ఆసుపత్రి రోగుల్లో 65 శాతం ఐసీయూలో
కరోనా మూడో వేవ్ మరీ అంత వేగంగా ముగిసిపోనుందా..? మరో నెల రోజుల్లో కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయా? ఢిల్లీ వైద్య మంత్రి చెబుతున్న మాటలను వింటుంటే అవుననే అనిపిస్తోంది. ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. కరోనా కేసులు ఈ వారంలోనే గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని.. ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఢిల్లీలో సోమవారం 19,000 కేసులు నమోదు కావడం తెలిసిందే.

వారాంతంలో కర్ఫ్యూ పెట్టే ఆలోచనను ప్రభుత్వం పరిశీలిస్తోందా? అన్న ప్రశ్నకు సత్యేంద్ర జైన్ స్పందించారు. ‘‘కేసులు ఇప్పటికే పతాక స్థాయికి (పీక్) చేరాయి. మరో ఒకటి రెండు రోజుల్లో మరింత గరిష్ఠానికి చేరతాయి. ఆ తర్వాత తగ్గొచ్చు. ప్రజలు తమ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా వుండడానికి కర్ఫ్యూను విధించే అవకాశం లేకపోలేదు’’ అని చెప్పారు.  

కోవిడ్ కేసులు ఢిల్లీలో సాధారణంగానే ఎక్కువగా ఉంటాయన్నారు జైన్. ఎక్కువ శాతం అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ ఢిల్లీకి సర్వీసులు నడిపిస్తుండడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. కేసులు ఎక్కువగా వస్తున్నా.. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉండడం సంతోషకరమని చెప్పారు.

‘‘రోజూ 20,000 వరకు కేసులు వస్తుంటే ఆసుపత్రుల్లోని పడకల్లో 2,000 నిండాయి. కోవిడ్ కు సంబంధించి 12,000 పడకలు ఖాళీగానే ఉన్నాయి. గతేడాది కరోనా రెండో వేవ్ లో రోజువారీ 20,000 కేసులు రాగా, అప్పుడు 12,000-13,000 పడకలు రోగులతో నిండిపోయాయి. అప్పుడంత తీవ్రత ఇప్పుడు లేదు. ఆరు రెట్లు తీవ్రత తక్కువగా ఉంది. 2,000 కోవిడ్ రోగుల్లో 65 శాతం మందే ఐసీయూల్లో ఉన్నారు’’అని గణాంకాలను వివరించారు. కాగా, ఢిల్లీలో సోమవారం పాజిటివ్ రేటు 25 శాతంగా ఉంది. 
New Delhi
covid cases
peak
minister
jain

More Telugu News