CPI Narayana: చెప్పులపై జీఎస్టీకి నిరసన.. చెప్పులు కుట్టి, పాలిష్ చేసిన సీపీఐ నారాయణ

CPI Narayana polish Chappals against govt decision on GST on Chappals
  • తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన
  • కేంద్రం కార్పొరేటర్లకు వంతపాడుతోందని ఆగ్రహం
  • సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
  • విగ్రహాల ధ్వంసం దారుణం
కేంద్ర ప్రభుత్వం చెప్పులపై 12 శాతం జీఎస్టీ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రోజుకోలా నిరసన తెలుపుతున్నారు. ఇటీవల నెత్తిపై చెప్పులు పెట్టుకుని నిరసన తెలిపిన ఆయన.. నిన్న చెప్పులు కుట్టి, పాలిష్ చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ నిన్న ఉదయం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చెప్పులు కుట్టి, పాలిష్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చెప్పులను కూడా వదలడం లేదని దుమ్మెత్తి పోశారు. సామాన్యుడి కష్టం తనకు తెలుసు కాబట్టే నెత్తిన చెప్పులు పెట్టుకున్నానని అన్నారు. దీనికి బీజేపీ నేతలు మాత్రం స్థాయి దిగజారిపోయారని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు వంతపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలోని సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడుతూ.. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోయడానికి ప్రయత్నించడం శోచనీయమని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
CPI Narayana
Tirumala
Chappals
GST

More Telugu News