RRR: 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదా... అభిమానుల్లో తీవ్ర నిరాశ

RRR release date postponed
  • దేశంలో మళ్లీ కరోనా కేసుల్లో పెరుగుదల
  • ఆంక్షల గుప్పిట్లోకి పలు రాష్ట్రాలు
  • థియేటర్ల మూసివేత
  • ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల చేయలేమన్న చిత్రబృందం
దేశంలో కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల, ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.

వాస్తవానికి జనవరి 7న ఆర్ఆర్ఆర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అంతా సిద్ధమైంది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ ప్రచారం ముమ్మరం చేశారు. అయితే, గడచిన కొన్నిరోజులుగా దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. అటు ఒమిక్రాన్ సైతం ఆందోళనకర రీతిలో వ్యాపిస్తోంది. దాంతో అనేక రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, తమ చిత్రాన్ని విడుదల చేయకపోవడమే మేలని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావిస్తోంది. "చిత్రం విడుదల కోసం మేం ఎంతో శ్రమించినా కొన్ని పరిస్థితులు మా నియంత్రణలో ఉండవు. అనేక రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేస్తున్నారు. మీ ఉద్విగ్నతను మరికొన్నాళ్లు అట్టిపెట్టుకోవాలని చెప్పడం మినహా మాకు మరో మార్గం కనిపించడంలేదు. అయితే, భారతీయ సినిమా ఖ్యాతిని చాటి చెప్పేలా సరైన సమయంలో మీ ముందుకు వస్తాం" అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రబృందం తన ప్రకటనలో పేర్కొంది.
RRR
Release
Postpone
Corona Virus
Omicron
India

More Telugu News