Team India: అండర్-19 ఆసియా కప్ గెలిచిన టీమిండియా కుర్రాళ్లు... ఫైనల్లో శ్రీలంకపై ఘనవిజయం

Team India won under nineteen Asia Cup title
  • దుబాయ్ లో ఆసియాకప్ అండర్-19 టోర్నీ
  • ఫైనల్లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించిన భారత్
  • రాణించిన ఓపెనర్ రఘువంశి
  • మరోసారి ఆకట్టుకున్న గుంటూరు కుర్రాడు రషీద్
దుబాయ్ లో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన ఫైనల్లో భారత కుర్రాళ్లు 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించారు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో టీమిండియా అండర్-19 జట్టు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం రెండు గంటల పాటు అంతరాయం కలిగించడంతో ఓవర్లను 38కి తగ్గించారు.

కాగా, మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి 38 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు చేసింది. వికీ ఓస్త్వాల్ 3, కౌశల్ తంబే 2, రాజ్ వర్ధన్ హంగార్గేకర్ 1, రవికుమార్ 1, రాజ్ బవా 1 వికెట్ తీశారు. లంక జట్టులో యసిరు రోడ్రిగో చేసిన 19 పరుగులే అత్యధికం.

అనంతరం డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం భారత్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 102 పరుగులకు కుదించారు. ఏమంత కష్టసాధ్యం కాని ఈ లక్ష్యాన్ని టీమిండియా 21.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి ఛేదించింది. ఓపెనర్ రఘువంశి 56 పరుగులతోనూ, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ 31 పరుగులతోనూ అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. లంక జట్టులో యసిరు రోడ్రిగో ఒక వికెట్ సాధించాడు.
Team India
Asia Cup
Title
Under-19

More Telugu News