UAE: ధనవంతుల కుటుంబాలకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్న యూఏఈ!

UAE Takes On Against Big Families Businesses
  • ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్
  • ఓ చట్టాన్ని తీసుకురానున్న యూఏఈ ప్రభుత్వం
  • విదేశీ సంస్థలే నేరుగా అమ్ముకునే వెసులుబాటు
ధనవంతుల కుటుంబాలకు షాకిచ్చే నిర్ణయాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం తీసుకుంది. దిగుమతి చేసుకున్న వస్తువుల వ్యాపారాలపై వారి ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ వ్యాపారాలు చేస్తున్న పలు ధనిక కుటుంబాలకు యూఏఈ ప్రభుత్వం తెలియపరిచిందని తెలుస్తోంది. దానికి సంబంధించి ఓ చట్టాన్ని సిద్ధం చేసినట్టు సమాచారం.

ఆ చట్టం ప్రకారం విదేశీ వస్తువుల అమ్మకాలకు సంబంధించిన వ్యాపారాల లైసెన్స్ ఆటోమేటిక్ పునరుద్ధరణను ఎత్తేయనున్నారు. తద్వారా విదేశీ సంస్థలు నేరుగా తమ ఉత్పత్తులను యూఏఈలో విక్రయించుకునే వెసులుబాటు కల్పించనుంది. లేదా వేరే సంస్థకు తమ ఉత్పత్తులను అమ్మే హక్కును అందించేందుకు అవకాశం ఇవ్వనుంది.

అయితే, ఈ కొత్త చట్టాన్ని ఎప్పటి నుంచి అమలు చేసేది అన్న విషయంలో కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. వీలైనంత త్వరగానే దానిని తీసుకొచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం యూఏఈలో వాణిజ్య కార్యకలాపాల్లో కొన్ని కుటుంబాల హవానే నడుస్తోంది. సూపర్ మార్కెట్ చెయిన్ల దగ్గర్నుంచి కార్ల డీలర్ షిప్ వరకు కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. ఉదాహరణకు మాజిద్ అల్ ఫత్తయిమ్ హోల్డింగ్ అనే సంస్థ.. క్యారీఫోర్ ఎస్ఏ స్టోర్స్ ను చూస్తోంది. అల్ హబ్తూర్ గ్రూప్ అనే సంస్థ హోటళ్ల దగ్గర్నుంచి రియల్ ఎస్టేట్, కార్ డీలర్ షిప్ వ్యాపారాలను తన చేతుల్లో ఉంచుకుంది.
UAE
Big Families
Rich
Imported Goods

More Telugu News