Guntur District: కొవిడ్ బారినపడిన బాలిక.. చికిత్స ఇప్పిస్తామని తీసుకెళ్లి వ్యభిచారం.. ప్రధాన నిందితురాలు సినిమా నిర్మాత!

Guntur Police arrest 21 Prostitute organizers cine producer among them
  • బాలిక జీవితంతో చెలగాటం
  • విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ తీసుకెళ్లి వ్యభిచారం
  • తప్పించుకుని వస్తూ మరో ముఠాకు చిక్కిన బాధిత బాలిక
  • రూ. 40 వేలకు వేరొకరికి అమ్మేసిన మహిళ
  • మొత్తం 21 మంది అరెస్ట్
కరోనా బారినపడిన ఓ బాలికను చికిత్స పేరుతో తీసుకెళ్లిన ఓ ముఠా చిన్నారితో బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన మహిళ ఓ సినిమాను నిర్మిస్తుండడం గమనార్హం. గుంటూరులో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని మేడికొండూరు మండలానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఈ ఏడాది జూన్ 26న కరోనా బారినపడింది. ఆమె ద్వారా తల్లికి కూడా వైరస్ సంక్రమించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ క్రమంలో బాలిక తండ్రికి పరిచయమైన గుంటూరు ద్వారకానగర్‌కు చెందిన స్వర్ణకుమారి నాటుమందు ఇప్పిస్తానని బాలిక తండ్రిని నమ్మించి ఆమెను తీసుకెళ్లింది. అనంతరం స్థానిక చైతన్యపురిలో ఆమెను నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయించడం మొదలుపెట్టింది. కుమార్తె కోసం ఆమె తండ్రి ఫోన్ చేసిన ప్రతిసారి చికిత్స తీసుకుంటోందని చెప్పి నమ్మబలికింది.

బాలికను నిర్బంధించిన స్వర్ణకుమారి విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న బాలిక తప్పిపోయిందంటూ నల్లపాడు పోలీసులకు స్వర్ణకుమారి ఇటీవల ఫిర్యాదు చేసింది. మరోవైపు, నెల్లూరులో ముఠా చెర నుంచి తప్పించుకున్న బాలిక విజయవాడ బస్టాండుకు చేరుకుంది. అక్కడ ఆమెకు పరిచయమైన వ్యభిచార ముఠా నిర్వాహకురాలు నాగలక్ష్మి.. ఇంటికి తీసుకెళ్తానని బాధిత బాలికను నమ్మించి తణుకు తీసుకెళ్లి అక్కడ శారద అనే వ్యభిచార నిర్వాహకురాలికి అమ్మేసింది.

ఆమె అశ్విని అనే మహిళ వద్దకు బాలికను పంపింది. విజయవాడకు చెందిన మాజీ హోంగార్డు జెసింత, ఆమె కుమార్తె హేమలతకు బాలికను అశ్విని రూ. 40 వేలకు విక్రయించింది. వీరిద్దరూ కలిసి బాలికతో వ్యభిచారం చేయించేవారు. ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాగా చదివిస్తామని బాలికను నమ్మించిన జెసింత, హేమలత సత్తెనపల్లిలో బాధితురాలు చదువుతున్న పాఠశాలకు వెళ్లి టీసీ ఇవ్వమని కోరారు. అయితే, తండ్రి వస్తే తప్ప టీసీ ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఓ కారు డ్రైవరును తీసుకెళ్లి ఆమె తండ్రిగా చెప్పి టీసీ తీసుకునేందుకు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది.

దీంతో ఈసారి నేరుగా బాలిక తండ్రి వద్దకు వెళ్లి తాము మహిళామిత్ర వాళ్లమని, బాలికను పునరావాస కేంద్రంలో చేర్పిస్తామని చెప్పారు. తాము చెప్పినట్లు వినకుంటే కేసు పెడతామని బెదిరించడంతో చేసేది లేక ఆయన వచ్చి టీసీ ఇప్పించారు. టీసీ తీసుకున్న జెసింత, హేమలత బాలికను మళ్లీ విజయవాడ తీసుకెళ్లి వ్యభిచార కూపంలో పడేశారు. ఈ క్రమంలో ఒక రోజు బాలిక వారి కళ్లు కప్పి అక్కడి నుంచి తప్పించుకుని తండ్రి వద్దకు చేరుకుని జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది.

దీంతో ఆయన మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాకు చెందిన నిందితులతోపాటు హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన 21 మందిని అరెస్ట్ చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన మహిళ ఓ సినిమాను నిర్మిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Guntur District
Vijayawada
Nellore District
Girl
Prostitution
Crime News

More Telugu News