Rahul Dravid: కోహ్లీ నుంచి నేను కోరుకుంటున్నది ఇదే: రాహుల్ ద్రావిడ్

Rahul Dravid Reveals What He Expects From Virat Kohli
  • కోహ్లీ నుంచి గొప్ప సిరీస్ ను కోరుకుంటున్నా
  • కోహ్లీ గొప్ప ఆటగాడు, నాయకుడు
  • టెస్ట్ క్రికెట్ ను అమితంగా ఇష్టపడే ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు 
దక్షిణాఫ్రికా గడ్డపై కెప్టెన్ కోహ్లీ నుంచి తాను ఒక గొప్ప సిరీస్ ను కోరుకుంటున్నానని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. కోహ్లీ ఒక అద్భుతమైన ఆటగాడే కాకుండా, గొప్ప కెప్టెన్ అని కితాబునిచ్చారు. టెస్టుల్లో మన జట్టు పురోగతిని కొనసాగించాలని తాము భావిస్తున్నామని చెప్పారు. జట్టు పురోగతిలో కోహ్లీ పోషించిన పాత్ర గొప్పదని అన్నారు.

టెస్టు క్రికెట్ ను అమితంగా ఇష్టపడే ఆటగాళ్లలో కోహ్లీ ఒకడని చెప్పారు. ఈ టెస్ట్ సిరీస్ లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం తనకుందని అన్నారు. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించిన తర్వాత వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీపై ద్రావిడ్ ప్రశంసలు కురిపించడం గమనార్హం.  

కెప్టెన్ ను ఎంపిక చేయడం లేదా తప్పించడం అనేది సెలెక్టర్ల బాధ్యత అని ద్రావిడ్ అన్నారు. ఈ విషయంలోకి తాను పోదలుచుకోలేదని చెప్పారు. ఆ విషయం గురించి మాట్లాడటానికి ఇది సరైన స్థలం కానీ, సమయం కానీ కాదని అన్నారు. తొలి టెస్టులో 11 మంది ఎవరు ఆడాలనే దానిపై మేము పూర్తి స్పష్టతతో ఉన్నామని... అయితే ఎవరు ఆడతారనే విషయాన్ని ఇప్పుడే ప్రత్యర్థికి తాము చెప్పదలుచుకోలేదని తెలిపారు.
Rahul Dravid
Virat Kohli
Team India

More Telugu News