Vellampalli Srinivasa Rao: ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప ఏనాడైనా ఆలయాన్ని అభివృద్ధి చేశారా?: అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి ఫైర్

Minister Vellampalli fires on Ashok Gajapathi Raju
  • రామతీర్థం రామాలయ నిర్మాణ శంకుస్థాపనలో రభస
  • తనను అవమానించారన్న అశోక్ గజపతిరాజు
  • అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న వెల్లంపల్లి
  • రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శలు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో రామాలయ నిర్మాణం శంకుస్థాపనలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఆలయ ధర్మకర్తనైన తనను తీవ్రంగా అవమానించారంటూ టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు.

ధర్మకర్తనని చెప్పుకునే అశోక్ గజపతిరాజు ఏనాడైనా ఆలయ అభివృద్ధికి కృషి చేశారా? అని ప్రశ్నించారు. పైగా, నూతన ఆలయానికి శంకుస్థాపన చేస్తుంటే రభస సృష్టించారని విమర్శించారు. ఆలయ అభివృద్ధి చేయకపోగా, తాము చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని అన్నారు. రూ.4 కోట్లతో రామతీర్థంలో ఆలయ అభివృద్ధి పనులు చేస్తుంటే సర్కస్ కంపెనీ అంటూ తూలనాడడం సరికాదని అన్నారు.

అశోక్ గజపతిరాజును ఆలయ మర్యాదల ప్రకారమే ఆహ్వానించామని వెల్లంపల్లి తెలిపారు. కానీ ఆయన హుందాతనం మరిచి వ్యవహరించారని విమర్శించారు. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏమీ జరగకపోయినా, ఏదో జరిగినట్టు అశోక్ గజపతిరాజు రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. రాజకీయ మనుగడ లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఆలయంలో రాజకీయాలు చేస్తే దేవుడు వదిలిపెట్టడని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.
Vellampalli Srinivasa Rao
Ashok Gajapathi Raju
Ramalayam Temple
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News