Team India: ఒమిక్రాన్ వల్ల బోర్డర్లను మూసేస్తే... దక్షిణాఫ్రికాలో ఉన్న టీమిండియా ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి?

Team India cricketers will be allowed to fly back from South Africa if boarders closed
  • దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా
  • రోజురోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
  • బీసీసీఐకి పలు హామీలు ఇచ్చిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు
టీమిండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభంకానుంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయాందోళనల్లోకి నెడుతున్న వేళ ఈ టెస్ట్ సిరీస్ జరుగుతోంది. దక్షిణాఫ్రికాలోనే ఈ వేరియంట్ పుట్టిన సంగతి తెలిసిందే.

ఇక ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఈ సిరీస్ పై నీలినీడలు కమ్ముకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. అసలు దక్షిణాఫ్రికా టూర్ కు భారత్ వెళ్లడం లేదనే వార్తలు కూడా తొలుత వచ్చాయి. అయితే దక్షిణాఫ్రికా క్రెకెట్ బోర్డు బీసీసీఐకి పలు గ్యారెంటీలు ఇచ్చిన తర్వాతే... అక్కడకు వెళ్లడానికి మన బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సౌతాఫ్రికా బోర్డు ఇచ్చిన హామీ మేరకు మన ఆటగాళ్లు ఏదైనా కారణంగా అనారోగ్యానికి గురైతే వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చేందుకు బెడ్స్ రెడీగా ఉంచాలి. దీనిపై సౌతాఫ్రికా క్రెకెట్ బోర్డు చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ... తాము కొన్ని హాస్పిటల్స్ గ్రూపులతో మాట్లాడామని, భారత ఆటగాళ్ల కోసం ఆసుపత్రుల్లో బెడ్స్ సిద్ధంగా ఉంచుతామని వారు గ్యారంటీ ఇచ్చారని తెలిపారు. ఒకవేళ కేసులు పెరిగి బోర్డర్లను మూసేసే పరిస్థితే వస్తే... టీమిండియా ప్లేయర్లు భారత్ తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తామని తమ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.

భారత జట్టుకు అన్ని ఆప్షన్లూ ఓపెన్ గా ఉంటాయని... ఏ సమయంలోనైనా వారు సొంత దేశానికి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చని చెప్పారు. అయితే భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే విషయం గురించి మాత్రమే తాము ఆలోచిస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వంతో మాట్లాడేందుకు తమ ప్రభుత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సంబంధాలు, సహకారం విభాగం ఉందని... అయితే క్రికెట్ బోర్డుగా తమకు అధికారాలు లేవని అన్నారు. భారత ఆటగాళ్లు తిరిగి వెళ్లిపోవాలనుకునే సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో ముందే ఊహించలేమని చెప్పారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ స్పందన కూడా చాలా ముఖ్యమని అన్నారు.

భారత ఆటగాళ్ల రక్షణ కోసం తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వారు ఇక్కడ సురక్షితంగా ఉండటమే కాకుండా, ఏ కారణం చేతనైనా వెళ్లిపోవాలనుకుంటే అంతే సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం కూడా తమకు ముఖ్యమని అన్నారు. దక్షిణాఫ్రిలో ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడబోతోంది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లు జరగనున్నాయి.
Team India
South Africa
Tour
Omicron

More Telugu News